- ఆర్చీని చూడలేనేమోనని క్వీన్ ఆవేదన
- అధికారిక ప్రకటన విడుదల చేసిన క్వీన్ ఎలిజబెత్2
- ఇంటికి అయిన ఖర్చు కూడా తిరిగి కట్టేయనున్న హ్యారీ
- దాంతో పాటు ఆ ఇంటికి రెంట్ కూడా చెల్లింపు
ప్రిన్స్ హ్యారీ, ప్రిన్సెస్ మెగన్ మార్కెల్లు పూర్తిగా రాయల్ ఫ్యామిలీ నుంచి బయటకొచ్చేశారు. రాయల్ ఫ్యామిలీలో అన్ని పదవులనూ వదిలేసుకున్నారు. ఎలాంటి ‘టైటిల్స్’ లేకుండా సామాన్యుల్లా బతకనున్నారు. శనివారం ఈ మేరకు బకింగ్‌హాం ప్యాలేస్ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. క్వీన్ ఎలిజబెత్2 ఫ్యామిలీలో జరిగిన చర్చల వివరాలను ప్రకటనలో వెల్లడించారు.
టైటిల్స్ వదులుకుంటరు.. డబ్బులు కట్టేస్తరు
రాయల్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్లకు హెచ్ఆర్హెచ్ (హిస్/హర్ రాయల్ హైనెస్) టైటిల్స్ ఉంటాయి. అంటే, మిలటరీ పదవుల దగ్గర్నుంచి, ప్రజలు కట్టే రాయల్ ట్యాక్స్ వరకు అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ పదవులన్నింటికీ హ్యారీ దూరమవుతారు. అంతేగాకుండా వేరు కాపురం పెట్టాక ప్రత్యేకంగా కట్టించుకున్న ఫ్రాగ్మోర్ కాటేజీకి ఖర్చయిన మొత్తాన్నీ తిరిగి చెల్లించేందుకు ఓకే చెప్పారు. దాని కోసం ఖర్చు చేసిన రూ.22.19 కోట్ల (24 లక్షల బ్రిటన్ పౌండ్లు)తో పాటు, వాళ్లు ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులకు కమర్షియల్ రెంట్ (కిరాయి) సుమారు రూ.3.32 కోట్లు (3.6 లక్షల పౌండ్లు ఏడాదికి) చెల్లించేందుకు హ్యారీ, మెగన్లు సిద్ధమయ్యారు. రాయల్ ఫ్యామిలీ నుంచి బయటికొచ్చినా ఎక్కడా క్వీన్ గౌరవానికి భంగం కలగకుండా మెసులుకుంటామని వాళ్లిద్దరు హామీ ఇచ్చారు. ‘‘డ్యూక్, డచెస్ ఆఫ్ ససెక్స్లు రాయల్ ఫ్యామిలీకి, క్వీన్‌కు ఎప్పుడూ కృతజ్ఞత భావంతోనే ఉంటారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం మిలటరీ పదవులు సహా అన్ని రాయల్ డ్యూటీల నుంచి వాళ్లు తప్పుకోవాలి. వాళ్లకు ఇకపై ప్రజల నుంచి వచ్చే ఏ నిధులూ, రాయల్ పన్నులూ అందవు. వాళ్లతో ఇకపై క్వీన్‌కు సంబంధం లేదు. ఆమె గౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకుంటామని హ్యారీ, మెగన్ హామీ ఇచ్చారు. ఇకపై ఎలాంటి హెచ్ఆర్హెచ్ టైటిట్స్ వాళ్లకు వర్తించబోవు’’ అని ప్రకటనలో రాణి స్పష్టం చేశారు. అయితే, వాళ్లకు ఇచ్చే సెక్యూరిటీపై మాత్రం ఇప్పుడే మాట్లాడదలచుకోలేదని తెలిపారు. వాళ్లకు సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా అని తేల్చేందుకు ఓ ప్రాసెస్ ఉందని వివరించారు. మిలటరీ వాళ్లకు హ్యారీ తండ్రి ప్రిన్స్ చార్లీ, కొద్ది రోజుల పాటు ‘ప్రైవేట్’గా ఆర్థిక సాయం చేయనున్నారు. అయితే, వాళ్లిద్దరూ బయటకు వెళ్లిపోతున్నారు కాబట్టి, వాళ్ల వాటాగా కొన్ని బిలియన్ పౌండ్లు వచ్చే అవకాశముందని చెబుతున్నారు. ప్రస్తుతం హ్యారీ, మెగన్లు నార్త్ అమెరికా టూర్లో ఉన్నారు.
మెగన్ తొందరగా కలిసిపోయింది
స్వతంత్రంగా బతికేందుకు నిర్ణయించుకున్న హ్యారీ, మెగన్లకు ఎప్పుడూ రాయల్ ఫ్యామిలీ నుంచి సహకారం ఉంటుందని క్వీన్ ప్రకటనలో తెలిపారు. అంతేగాకుండా మెగన్పై ప్రశంసలు కురిపించారు. ఆమె తొందరగా ఫ్యామిలీలో కలిసిపోయారని మెచ్చుకున్నారు. ‘‘కొద్ది నెలలుగా సాగుతున్న చర్చలు, ఇటీవలి మాటామంతితో నా మనవడు, అతడి కుటుంబానికి నిర్మాణాత్మక సాయం చేసేందుకు నిర్ణయించాం. హ్యారీ, మెగన్, ఆర్చీ ఎప్పుడూ మా కుటుంబానికి ఆప్తులే అవుతారు. రెండేళ్లుగా ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో హ్యారీ కుటుంబం స్వతంత్రంగా బతికేందుకు ఒప్పుకుంటున్నాం. మెగన్ మా ఫ్యామిలీలో తొందరగా కలిసిపోయిన తీరు అభినందనీయం’’ అని పేర్కొన్నారు.
మునిమనవడ్ని చూసింది చాలా తక్కువ
తన మునిమనవడు ఆర్చీని చాలా తక్కువ సార్లు చూశానని క్వీన్ ఎలిజబెత్2 చాలా బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆర్చీ పుట్టిన రెండు రోజులకు మనవడిని చూసిన ఆమె, ఆ తర్వాత ఆర్చీని చూసిందే లేదని రాజకుటుంబం వర్గాలు చెబుతున్నాయి. ఆర్చీకి రెండు నెలల వయసులో బాప్టిజం ఇప్పించే వేడుకకు ఆమె హాజరు కాలేకపోయారు. ఏటా శాండ్రింగ్హాంలో జరిగే ప్రైవేట్ వీకెండ్ ప్రోగ్రామ్ ఉన్నందున ఆ కార్యక్రమానికి వెళ్లలేకపోయారు. అయితే, ఇప్పుడు హ్యారీ ఫ్యామిలీ పూర్తిగా రాయల్ కుటుంబం నుంచి వెళ్లిపోతుండడంతో ఇకపై ఆర్చీని చూడలేనేమోనని క్వీన్ బాధపడుతున్నారని చెబుతున్నారు. తన అన్నలు, అక్కలతో కలిసి పెరగడని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. ఆమెతో పాటు ఆర్చీ తాత చార్లెస్ కూడా తీవ్రమైన మనోవేదనలో ఉన్నట్టు చెబుతున్నారు. ప్రిన్స్ జార్జ్, ప్రిన్సెస్ చార్లెట్, ప్రిన్స్ లూయీలకు ఆర్చీ దూరమవుతాడేమోనని ఆందోళన చెందుతున్నట్టు ప్యాలేస్ వర్గాలు చెబుతున్నాయి. తాను కూడా ఆర్చీని చూసి చాలా రోజులైందని ఆయన అన్నట్టు సమాచారం.
see more news సిటీలు,టౌన్ల అభివృద్ధికి రూ.65,845 కోట్లు కావాలి