IPL 2025: రూ.6 కోట్ల కంటే దేశమే ముఖ్యం.. ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్ క్రికెటర్

IPL 2025: రూ.6 కోట్ల కంటే దేశమే ముఖ్యం.. ఐపీఎల్ నుంచి వైదొలిగిన ఇంగ్లాండ్ క్రికెటర్

ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఢిల్లీ క్యాపిటల్స్ ను బిగ్ షాక్ ఇచ్చాడు. మరో 12 రోజుల్లో జరగనున్న ఐపీఎల్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. 26 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. బ్రూక్ ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో రెగ్యులర్ ప్లేయర్. జూన్ నెలలో ఇండియాతో ఇంగ్లాండ్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. 2025-27 టెస్ట్ ఛాంపియన్స్ షిప్ లో భాగంగా  ఇంగ్లాండ్ ఆడుతున్న తొలి సిరీస్ ఇది. 

టెస్టుల్లో బ్రూక్ టాప్ ఫామ్ లో ఉన్నాడు. 50కి పైగా యావరేజ్ తో ఫ్యూచర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇటీవలే పాకిస్థాన్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో జోస్ బట్లర్ స్థానంలో కెప్టెన్‌గా బాధ్యతలు బ్రూక్ కు అప్పగించనున్నట్టు సమాచారం. బ్రూక్ తీసుకున్న ఈ నిర్ణయంతో అతను వచ్చే సీజన్ ఐపీఎల్ లో కూడా ఆడకపోవచ్చు. ఐపీఎల్ ప్రకటించిన కొత్త రూల్స్ ప్రకారం ఐపీఎల్ ఆక్షన్ లో పాల్గొని టోర్నీ నుంచి తప్పుకుంటే రెండేళ్లు నిషేధం తప్పదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యారీ బ్రూక్ ను రూ. 6.25 కోట్లకు దక్కించుకుంది. బ్రూక్ స్థానంలో ఢిల్లీ ఇంకా ఎవరినీ తీసుకోలేదు.  

ఐపీఎల్ నుంచి తనకు తప్పుకోవడంపై ఢిల్లీ క్యాపిటల్స్ కు బ్రూక్ క్షమాపణలు తెలిపాడు. "రాబోయే ఐపీఎల్ నుంచి వైదొలగాలని నేను చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. ఢిల్లీ క్యాపిటల్స్ కు నేను బేషరతుగా క్షమాపణలు కోరుతున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఆడాలని కలలు కన్నాను. నా దేశం కోసం ఆడటం నా తొలి ప్రాధాన్యత. ఈ స్థాయిలో నేను ఇష్టపడే ఆటను ఆడే అవకాశం లభించినందుకు నేను చాలా కృతజ్ఞుడను." అని బ్రూక్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.