IPL 2025: యువ క్రికెటర్‌కు బంపర్ ఆఫర్.. ఐపీఎల్ వద్దనుకుంటే ఇంగ్లాండ్ కెప్టెన్‌ను చేశారు

IPL 2025: యువ క్రికెటర్‌కు బంపర్ ఆఫర్.. ఐపీఎల్ వద్దనుకుంటే ఇంగ్లాండ్ కెప్టెన్‌ను చేశారు

ఇంగ్లాండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు బ్రూక్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనుంది. ఇంగ్లాండ్ టీ20 క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా బ్రూక్ ను నియమించనుంది. అధికారిక ప్రకటన రాకపోయినా బ్రూక్ ఇంగ్లాండ్ టీ20 కెప్టెన్ కావడం దాదాపుగా ఖరారైనట్టు సమాచారం. 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ జోస్ బట్లర్ తన కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. శుక్రవారం (ఫిబ్రవరి 28) బట్లర్ తన కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాడని అధికారికంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా పరాజయాలే ఇందుకు కారణమని తెలుస్తుంది. బట్లర్ టీ20, వన్డేల నుంచి నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో హ్యారీ బ్రూక్ ను టీ20 కెప్టెన్ గా ప్రకటించనున్నారు. ఇక వన్డేల్లో బెన్ స్టోక్స్ కు ఆ బాధ్యతలు అప్పజెప్పే అవకాశమున్నట్టు తెలుస్తుంది. స్టోక్స్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా.. అతన్ని జట్టులోకి తీసుకురావాలను ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు భావిస్తోందట. 

ALSO READ | IPL 2025: మరో రెండు మ్యాచ్‌లకు దూరం.. బుమ్రా ఐపీఎల్‌లో అడుగు పెట్టేది ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న స్టోక్స్.. కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కోరిక మేరకు ఇంగ్లాండ్ తరఫున వన్డే క్రికెట్ ఆడటానికి స్టోక్స్ అంగీకరించినట్టు తెలుస్తుంది. స్టోక్స్ కు వన్డే కెప్టెన్సీ అప్పగించి బ్రూక్ కు వైస్ కెప్టెన్సీ అందించాలని ఈసీబీ భావిస్తున్నారు సమాచారం. ఒకవేళ ECB స్టోక్స్‌ను తిరిగి జట్టులోకి తీసుకోకూడదని నిర్ణయించుకుంటే, వన్డే జట్టుకు కూడా బ్రూక్ నాయకత్వం వహించే అవకాశం ఉంది.