Harry Brook: దేశానికే మొదటి ప్రాధాన్యత.. ఎంత డబ్బు వదులుకోవడానికైనా సిద్ధం: సన్ రైజర్స్ మాజీ ఆటగాడు

Harry Brook: దేశానికే మొదటి ప్రాధాన్యత.. ఎంత డబ్బు వదులుకోవడానికైనా సిద్ధం: సన్ రైజర్స్ మాజీ ఆటగాడు

ఇంగ్లాండ్ క్రికెట్ కోసం ఐపీఎల్ లో రూ.6.25 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ను వదులుకున్న హ్యారీ బ్రూక్ కు బంపర్ అఫర్ లభించింది. ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సోమవారం (ఏప్రిల్ 7) బ్రూక్ ను కెప్టెన్ గా నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది. బట్లర్ స్థానంలో బ్రూక్ సారధ్య బాధ్యతలను స్వీకరిస్తాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎప్పుడూ కూడా ఫ్రాంచైజీ క్రికెట్ కంటే జాతీయ జట్టుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఆ లిస్ట్ లో యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ కూడా చేరిపోయాడు. కెప్టెన్ తర్వాత తొలిసారి మాట్లాడిన బ్రూక్.. ఫ్రాంచైజీ క్రికెట్ కంటే ఇంగ్లాండ్ తరపున ఆడడానికే ప్రాధాన్యత ఇస్తాడని తెలిపాడు. 

బ్రూక్ మాట్లాడుతూ.. "నేను ఇంగ్లాండ్ తరఫున క్రికెట్ ఆడాలనుకుంటున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించాను. నా కెప్టెన్సీలో జట్టు ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాను. ఫ్రాంచైజ్ క్రికెట్‌ను పూర్తిగా వదులుకోలేదు. కానీ ఇంగ్లాండ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడలేను. ఇంగ్లాండ్ జట్టు నా మొదట ప్రాధాన్యత. నా చివరి రోజుల్లో కూడా ఇంగ్లాండ్ కు ఆడడాన్ని నేను ఎక్కువగా ఆస్వాదిస్తాను. ఈ క్రమంలో ఎంత డబ్బు వదులుకోవడానికైనా నేను సిద్ధం". అని బ్రూక్ బుధవారం (ఏప్రిల్ 9) హెడింగ్లీలో అన్నారు.

హ్యారీ బ్రూక్ ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు గత నెలలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 26 ఏళ్ల ఈ యువ క్రికెటర్ ఐపీఎల్ కంటే దేశానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చాడు. ఇంగ్లాండ్ క్రికెట్ పైనే ఆడడంపై తాను దృష్టి పెట్టినట్టు ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో ఇప్పుడు బ్రూక్ కు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కొత్త కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. వన్డేలకు స్టోక్స్ ను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు ప్రచారం జరిగినా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాత్రం బ్రూక్ పై నమ్మకముంచింది. జనవరి 2022లో ఇంగ్లాండ్ తరుపున అరంగేట్రం చేసిన బ్రూక్.. ఇప్పటి వరకు 26 వన్డేలు, 44 టీ20 మ్యాచ్ లు ఆడాడు.