Champions Trophy 2025: బుమ్రా లేకుంటే గెలవలేమా..! భారత పేసర్‌ను బలవంతం చేస్తున్న బీసీసీఐ

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా భారత క్రికెట్ లోనే కాదు ప్రపంచ క్రికెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన బౌలింగ్ తో ఎన్నో మ్యాచ్ ల్లో ఒంటి చేత్తో జట్టుకు విజయాలను అందించాడు. అయితే భారత క్రికెట్ మాత్రం బుమ్రాపై అతిగా ఆధారపడుతుంది. బుమ్రా లేకపోతే గెలవలేం అనే భయంలో ఉన్నట్టు అనిపిస్తుంది. గాయమైన అతన్ని జట్టులో కొనసాగిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో బుమ్రాను సెలక్ట్ చేశారు. 

అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ శనివారం (జనవరి 18) న ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ తో జరగనున్న మూడు వన్డేలకు జట్టుకు ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కు అదనంగా హర్షిత్ రానాను చేర్చడం చర్చనీయాంశంగా మారింది. హర్షిత్ రాకతో బుమ్రాకు గాయమైంట్టు స్పష్టంగా అర్ధమవుతుంది. బుమ్రా కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా తెలియదు. అయినప్పటికీ అతన్ని ఎంపిక చేసి సాహసం చేశారు. ఒకవేళ బుమ్రా పూర్తిగా కోలుకోకుండా ఛాంపియన్స్ ట్రోఫీ  టోర్నీ ఆడిస్తే అతని కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

ALSO READ | Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు ఇదే

బీసీసీఐ తీరు చూస్తుంటే బుమ్రాను ఎలాగైనా ఆడించే ఉద్దేశ్యంలో ఉన్నట్టు తెలుస్తుంది.  ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు బుమ్రా ఐపీఎల్.. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఐపీఎల్ పక్కన పెడితే ఇంగ్లాండ్ లో భారత్ టెస్ట్ సిరీస్ గెలవాలంటే బుమ్రా చాలా కీలకం. పూర్తి ఫిట్ నెస్ లేకుండా బుమ్రాను ఆడించి గాయపడితే అతను ఎక్కువ కాలం జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం బుమ్రా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.  బీసీసీఐ బుమ్రాను బలవంతం చేస్తే టీమిండియాకు నష్టం జరగొచ్చు.