సూర్యాపేట, వెలుగు: అక్రమంగా తరలిస్తున్న 300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సూర్యాపేట పోలీసులు పట్టుకున్నారు. గురువారం డీపీవో కార్యాలయంలో ఎస్పీ రాహుల్ హెగ్డే కేసు వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లారీ డ్రైవర్ బత్తుల గురవయ్య, క్లీనర్ గద్దల వెంకటేశ్వర్లు, ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన డ్రైవర్ కం ఓనర్ వడ్త్యా మంగులాల్, డ్రైవర్ పెనిగుంట నరేశ్ గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యం కొని హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.
బుధవారం సూర్యాపేట సీఐ రాజశేఖర్, ఎస్సై ప్రవీణ్ కుమార్, సిబ్బందితో కలిసి సూర్యాపేట–-జనగామ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నారు. బత్తుల గురువయ్యకు చెందిన లారీని ఆపి తనిఖీ చేయగా 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. ఇతనితో పాటు క్లీనర్ గద్దల వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఇచ్చిన సమాచారం మేరకు కూసుమంచికి వెళ్లి తనిఖీ చేయగా మూడు అశోక్ లీలాండ్ వాహనాల్లో 100 క్వింటాళ్ల రేషన్ బియ్యం దొరికింది. బియ్యాన్ని సీజ్ చేయడంతో పాటు నలుగురిపై నిత్యావసరాల వస్తువుల దుర్వినియోగం చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కోదాడకు చెందిన షేక్ మీరా అలీ పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.
Also read : చెన్నూరులో పత్తి కొనుగోళ్లు పెంచాలి : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి