- హర్యానాలో నలుగురు మృతి
- గాయపడినవారిని రక్షించేందుకు వెళ్లిన జనాలపై దూసుకెళ్లిన ట్రక్కు
చండీగఢ్/న్యూఢిల్లీ: హర్యానాలో హిసార్–-చండీగఢ్ నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా సరైన విజిబిలిటీ లేకపోవడంతో వాహనాలు ఒకదాన్ని మరొకటి వెనుక నుంచి ఢీ కొట్టుకున్నాయి. ఉక్లానాలోని సురేవాలా చౌక్ లో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. మొదటగా ఓ కారు డివైడర్ ను ఢీకొట్టింది. వెనుక వస్తున్న మరో కారు ముందున్న కారును టక్కర్ చేసింది. దీంతో గాయపడిన వారిని కాపాడేందుకు కొంతమంది వెళ్లి రోడ్డు మధ్యలో నిల్చున్నారు. ఆ సమయంలో ఓ ట్రక్కు వారిపై నుంచి దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అంతేకాకుండా పక్కన ఉన్న నాలుగు కార్లపైనా ట్రక్కు పడిపోయింది. అక్కడున్న వారు ట్రక్కు గ్లాస్‌ను పగలగొట్టి అతికష్టం మీద డ్రైవర్‌ను బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. ఉత్తర భారతంలోని పలు నగరాల్లో ఉదయం పూట దట్టమైన పొగమంచు ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది.
ఢిల్లీ ఎయిర్ పోర్టులో 100 విమానాలు ఆలస్యం
పొగమంచు కారణంగా సరైన విజిబిలిటీ లేకపోవడంతో ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో 100 విమానాలు ఆదివారం ఆలస్యంగా నడిచాయి. అయితే.. ఫ్లైట్లను దారి మళ్లించడం గానీ, రద్దుచేయడం గానీ జరగలేదని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. పొగమంచు వల్ల విమానాలు ఆలస్యంగా మాత్రమే నడుస్తున్నాయని చెప్పారు. అప్డేటెడ్ సమాచారం కోసం ప్రయాణికులు సంబంధిత ఎయిర్ లైన్స్ ను సంప్రదించాలని సూచించారు.
కాగా.. ఢిల్లీ నుంచి అమృత్ సర్, చండీగఢ్, కోల్ కతా, లక్నోకు వెళ్లే విమానాలు, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చే విమానాలు ఆలస్యంగా నడిచాయని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. ప్రత్యామ్నాయ విమానాల కోసం తమ వెబ్ సైట్ లేదా యాప్‌ను చూడాలని సూచించింది. అలాగే, పొగమంచు కారణంగా శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఆదివారం 10 ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.