చండీగఢ్: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. మధ్యాహ్ననికి అనూహ్యంగా బీజేపీ పుంజుకుని మ్యాజిక్ ఫిగర్(46) దాటేసింది.
దీంతో హర్యానాలో దశాబ్దం తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించి.. మళ్లీ తామే అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితాలు వ్యతిరేకంగా రావడంతో పార్టీలో తీవ్ర అసహనం నెలకొంది.
హర్యానాలో కాంగ్రెస్ ఓటమికి.. "సీఎం పదవి కోసం హుడా, కుమారి సెల్జాల మధ్య జరిగిన బహిరంగ టగ్ ఆఫ్ వార్ కారణమా ? లేక అభ్యర్థుల ఎంపికలో లోపాలు ఉన్నాయా? పార్టీ మితిమీరిన ఆత్మవిశ్వాసంతో పనిచేసిందా? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.