మాజీ అగ్నివీరులకు శాశ్వత ఉద్యోగం : నడ్డా

 మాజీ అగ్నివీరులకు శాశ్వత ఉద్యోగం : నడ్డా
  • మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తం
  • సంకల్ప్ పత్ర’ పేరుతో హర్యానా బీజేపీ మేనిఫెస్టో విడుదల

చండీగఢ్: హర్యానాలో మళ్లీ అధికారంలోకి వస్తే మాజీ అగ్నివీరులకు శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళలకు నెలకు రూ.2,100 ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపింది. అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ‘సంకల్ప్​ పత్ర’ పేరుతో కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీఎం నయాబ్ సైని, కేంద్ర మంత్రులు ఎంఎల్ ఖట్టర్, రావ్​ ఇంద్రజీత్ సింగ్, క్రిషన్ పాల్ గుర్జార్ గురువారం రోహతక్​లో మేనిఫెస్టో విడుదల చేశారు. 

ఈ సందర్భంగా జేపీ నడ్డా మాట్లాడారు. ‘‘హర్యానా నుంచి అగ్నివీర్​లుగా దేశానికి సేవ చేసి వచ్చినవాళ్లందరికీ పర్మినెంట్ జాబ్ కల్పిస్తాం. 24 పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. ఇప్పటికే 10 పంటలకు ఎంఎస్పీ అందజేస్తున్నం. లాడో లక్ష్మి యోజన కింద ప్రతి మహిళకు రూ.2,100 ఇస్తాం. హర్ ఘర్ గృహిణి యోజన కింద 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేస్తాం. బీజేపీ పాలనలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్, బీజేపీ పాలనలో మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది’’అని నడ్డా అన్నారు. 

కాంగ్రెస్ పాలన అంతా స్కామ్​లే..

కాంగ్రెస్ హయాంలో అన్నీ స్కామ్​లే జరిగాయని నడ్డా ఆరోపించారు. ‘‘అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 5 లక్షల ఇండ్లు కట్టిస్తాం. అవ్వల్ బాలిక యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు స్కూటర్లు ఇస్తాం. దేశంలోని ఏ గవర్నమెంట్ మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న హర్యానాకు చెందిన ఓబీసీ, ఎస్సీ స్టూడెంట్లకు స్కాలర్​షిప్స్ అమలు చేస్తాం’’అని నడ్డా ప్రకటించారు. ‘‘రెండు లక్షల మంది స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు.. నేషనల్‌‌‌‌ అప్రెంటిస్‌‌‌‌షిప్ ప్రమోషన్ స్కీమ్ కింద 5 లక్షల మందికి అదనంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. 

పది ఇండస్ట్రియల్ సిటీలను నిర్మిస్తాం. ఒక్కో సిటీలో 50 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. చిరాయు ఆయుష్మాన్ స్కీమ్ కింద ప్రతీ కుటుంబానికి రూ.10లక్షల వరకు ఫ్రీ ట్రీట్​మెంట్ ఇస్తాం. 70 ఏండ్లు పైబడినవారికి రూ.5 లక్షల అదనపు కవరేజీ ఉంటుంది’’అని నడ్డా ప్రకటించారు. ఆరావళి జంగిల్ సఫారిని అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేస్తామన్నారు.