- బీజేపీకి హర్యానాలో ఓటమి తప్పదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: క్రోనీ క్యాపిటలిస్ట్ విధానాలతో ప్రధాని మోదీ పన్నిన చక్రవ్యూహాన్ని హర్యానా ప్రజలు బద్దలుకొడతారని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల విజయ్ సంకల్ప్ యాత్ర సందర్భంగా మహిళలతో ఇంటరాక్ట్ అయిన వీడియోను రాహుల్ శుక్రవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. బీజేపీ సర్కార్ విధానాలను విమర్శిస్తూ వరుసగా పోస్టులు పెట్టారు.
‘‘బీజేపీ హయాంలో హర్యానాలో నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. దేశంలో అత్యధికంగా హర్యానాలోనే నిరుద్యోగం ఉన్నది. దీనికి కారణం గత పదేండ్లలో రాష్ట్రంలో ఉపాధి కల్పించే ప్రతి సిస్టమ్ ను బీజేపీ నాశనం చేసింది. జీఎస్టీ, నోట్ల రద్దు నిర్ణయాలతో చిన్న చిన్న వ్యాపారాలను దెబ్బతీసింది. వ్యవసాయానికి ఊతమివ్వకుండా రైతులకు అన్యాయం చేసింది. ఇవన్నీ చూసిన యువత విసిగిపోయారు. డ్రగ్స్ కు అలవాటుపడ్డారు. నేరాల బాట పట్టారు” అని రాహుల్ పేర్కొన్నారు. బీజేపీ విధానాలను హర్యానా ప్రజలు అర్థం చేసుకున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. రాష్ట్రంలో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడినంక 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేస్తామని హామీ ఇచ్చారు.