నేటి యువతకు ఇవి చాలా అవసరం

ముషీరాబాద్,వెలుగు: యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని, 2030 నాటికి ప్రపంచంలోనే భారత్ ​అగ్రగామి కానుందని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఏ దేశంలో లేని విధంగా ఇండియాలో యువత ఎక్కువగా ఉన్నారని తెలిపారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘సమాజంలో యువత పాత్ర’ అంశంపై వల్లూరి ఫౌండేషన్ వేదిక ఆధ్వర్యంలో జాతీయ కవి సమ్మేళనం జరిగింది. చీఫ్ ​గెస్ట్​గా హాజరైన గవర్నర్ దత్తాత్రేయ పలువురికి సేవారత్న అవార్డులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశభక్తి, చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం నేటి యువతకు చాలా అవసరమని చెప్పారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారని, వారిని గౌరవించి ప్రోత్సహించాలని సూచించారు. బడుగు, బలహీన వర్గాలకు అవకాశాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, దైవజ్ఞ శర్మ, జడ్జి బూర్గుల మధుసూదన్, వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ వీఆర్ శ్రీనివాస్, బ్రహ్మానందం, బీజేపీ సీనియర్ నేత వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.