- అందరినీ ఓ చోట సంఘటితం చేసే కార్యక్రమం: దత్తాత్రేయ
- పొలిటికల్ ప్రోగ్రామ్ కాదన్న హర్యానా గవర్నర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమం కోసం అందరినీ ఓ చోట సంఘటితం చేసేందుకు ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్టు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఈ ఏడాది13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితరులు హాజరవుతారని వెల్లడించారు.
సోమవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సోమవారం అలయ్ బలయ్ ఫౌండేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడారు. ‘‘అలయ్ బలయ్ పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు.. ఒక సాంస్కృతిక కార్యక్రమం. అన్ని పార్టీలను ఒకే వేదికపైకి చేర్చే కార్యక్రమం. అలయ్ బలయ్ 19వ వసంతంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇదొక ఆత్మీయ సమ్మేళనం.
తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేదే.. అలయ్.. బలయ్’’అని దత్తాత్రేయ అన్నారు. ‘అలయ్.. బలయ్’ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ.. అందరినీ ఒక్క చోటుకు తీసుకొచ్చి ఆప్యాయతను పంచేందుకే ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ మొదలుపెట్టారని చెప్పారు. మన ఇంట్లో చేసుకునే కార్యక్రమంలాంటిదే ఇది అని ఆమె తెలిపారు.