
హనుమకొండ, హసన్ పర్తి, వెలుగు:
రైతుల సంక్షేమం కోసం మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి పరితపించారని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. దాదాపు 50 ఏండ్ల రాజకీయ జీవితంలో ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు. హనుమకొండ జిల్లా భీమారంలోని పొద్దుటూరి గార్డెన్స్‌లో గురువారం నిర్వహించిన మందాడి సత్యనారాయణరెడ్డి సంస్మరణ సభకు దత్తాత్రేయ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ముందుగా హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న ఆయన ఎక్సైజ్ కాలనీలోని మందాడి ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ మందాడి సత్యనారాయణరెడ్డి జాతీయ భావాలు, దేశభక్తి కలిగిన మహనీయుడన్నారు. తెలంగాణ పట్ల చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి అన్నారు. మందాడి మంచి రచయిత, కవి, గాయకుడు, వక్త అని గుర్తు చేశారు. ఆయనకు ప్రతి విషయాన్ని లోతుగా తెలుసుకోవాలన్న తపన ఉండేదని, ప్రత్యేకంగా రైతుల సమస్యలపై లోతుగా అధ్యయనం చేయడమే కాకుండా వారి తరఫున పోరాడేవాడన్నారు. లక్షలాదిమంది కార్యకర్తలను తయారు చేయడమే లక్ష్యంగా మందాడి పనిచేశాడని పేర్కొన్నారు.
రాజకీయాలు వ్యాపారం కాకూడదు
మందాడి సత్యనారాయణరెడ్డి నిస్వార్థంగా ప్రజాక్షేత్రంలో 50 ఏండ్లకు పైగా పని చేశారని బండారు దత్తాత్రేయ గుర్తు చేశారు. రాజకీయాలు వ్యాపారం కాకూడదని, అలా అయిన రోజు సమాజం
ప్రమాదంలో పడుతుందని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. రాజకీయాలు ఉన్నతమైనవని, వాటిని ప్రజల మనసుల్లోంచి నిర్మించడమే సత్యనారాయణరెడ్డికి మనమిచ్చే నిజమైన నివాళి దత్తాత్రేయ అన్నారు. అనంతరం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ సత్యనారాయణరెడ్డి జీవితం ఎంతోమం దికి ఆదర్శమన్నారు. హుజురాబాద్‌లో బీజేపీ గెలు పు కోసం ఎంతో ఆరాటపడ్డారని, మునుగోడు గెలుపు కోసం కృషి చేశారన్నారు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరవేయడమే తన చివరి కోరిక అని చెబుతుండేవారన్నారు. తెలంగాణలో జరుగుతున్న అనేక సంఘటనలు చూసి ఆవేదన చెందేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, చందుపట్ల కీర్తిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మార్తినేని ధర్మారావు, వన్నాల శ్రీరాములు, బీజేపీ మత్స్య సెల్ కన్వీనర్ దేవు సాంబయ్య, నాయకులు గురుమూర్తి శివకుమార్, దేశిని సదానందం పాల్గొన్నారు.