- ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ వల్లే సంస్కారం, విలువలు నేర్చుకున్నా
- హర్యానా గవర్నర్ దత్తాత్రేయ
నిజామాబాద్, వెలుగు : చారిత్రకంగా, ప్రకృతిపరంగా ఎంతో విశిష్టత కలిగిన నిజామాబాద్ జిల్లా కందకుర్తి గ్రామాన్ని టూరిజం కింద డెవలప్ చేసేలా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చెప్పారు. కార్తీక మాసం సందర్భంగా రెంజల్ మండలంలోని కందకుర్తి వద్ద గోదావరి నదికి హారతి ఇచ్చిన అనంతరం, రామాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ నదులు, ప్రకృతి కలుషితం కాకుండా ప్రతి పౌరుడు ప్రయత్నం చేయాలని సూచించారు.
నదీ స్నానానికి ఎంతో పవిత్రత ఉందని, ప్రతి ఒక్కరూ నీరు, భూమి, చెట్టు, గోమాతను పూజించాలని సూచించారు. పేద కుటుంబంలో పుట్టిన తాను కేంద్ర మంత్రి, గవర్నర్‌గా ఎదిగేందుకు ఆర్‌ఎస్‌ఎస్సే కారణమన్నారు. సంఘ్ ద్వారా సంస్కారం, నైతిక విలువలు నేర్చుకొని వ్యక్తిగా నిర్మితమయ్యానన్నారు. 1968 నుంచి 76 దాకా నిజామాబాద్ జిల్లాలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా పనిచేశానని గుర్తు చేశారు. ప్రస్తుతం గవర్నర్ హోదాలో కాకుండా సంఘ్సేవకుడిగా వచ్చానని చెప్పారు. భారత్‌ను మూడో అగ్రదేశంగా నిలబెట్టే లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, దేశ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారన్నారు.
అనంతరం సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్హెడ్గే వార్ పూర్వీకులు నివసించిన స్థలంలో నిర్మిస్తున్న కేశవ స్మారక మందిరం పనులను పరిశీలించారు. మందిరం బ్లూప్రింట్‌ను చూశారు. ఆయన వెంట బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, కేశవ సేవా సమితి అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మేక సంతోష్, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు హన్మంత్‌రావు, గోవింద్, రచ్చ తిరుపతి, రమేశ్ ఉన్నారు. అంతకుముందు డిచ్‌పల్లి వద్ద మాజీ ఎంపీపీ భూమయ్య ఇంటి వద్ద కొద్దిసేపు ఆగారు. ఆయనకు అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ దినేశ్, పల్లె గంగారెడ్డి తదితరులు స్వాగతం పలికారు.