హైదరాబాద్ సిటీ, వెలుగు: కవికి రాగద్వేషాలు ఉండకూడదని, అలాంటి వ్యక్తి రెహనా అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కొనియాడారు. ఆమె రాసిన ‘నదీ వాక్యం’ కవితా సంకలనం పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన ముఖ్యఅతిథిగా ఆవిష్కరించారు. నదీ వాక్యం అనేది విశ్వాసం ఉన్న పేరు, విశ్వాసంతో సత్యాన్ని చెప్తూ రాసిన పుస్తకమని తెలిపారు. నేటి సమాజానికి, రాజకీయ పరిస్థితులకు ఈ పుస్తకం అద్దం పడుతుందన్నారు. రెహనా ఏపీ ఆర్టీఐ కమిషనర్ గా ఉండి ఒక ముస్లిం మహిళగా తెలుగు మీద ఇంత పట్టు సాధించి, ఇలాంటి కవితలతో ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం అభినందనీయమన్నారు.
అనంతరం రెహనా మాట్లాడుతూ.. తన కుటుంబ నేపథ్యంలో చదువు అనేదే లేదని, కానీ తాను అదృష్టవశాత్తు చదువుకున్నట్లు తెలిపారు. ఒకవైపు జర్నలిస్టుగా అన్నివిధాల సమాజం మీద పట్టు ఉండడం, అన్నిరకాల భావోద్వేగాలు తనకు తెలియడం వల్ల కవితలు రాయడం ప్రారంభించానని తెలిపారు. ప్రతి మనిషి జీవితంలో ఉన్నట్టే తన జీవితంలోనూ సంక్షోభాలు ఉన్నాయని, వాటిని కవితల రూపంలో రాసినట్లు వివరించారు. సభకు మన తెలంగాణ ఎడిటర్ దేవులపల్లి అమర్ అధ్యక్షత వహించగా, కవి యాకూబ్, తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు కె. శ్రీనివాస రెడ్డి, నేషనల్ బుక్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు వల్లీశ్వర్, కొమ్మినేని శ్రీనివాసరావు, నేమాని మీడియా హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.