వ్యాక్సినేషన్‌ వేసుకున్నోళ్లకే పబ్లిక్ ప్లేసుల్లోకి ఎంట్రీ

వ్యాక్సినేషన్‌ వేసుకున్నోళ్లకే పబ్లిక్ ప్లేసుల్లోకి ఎంట్రీ

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం మళ్లీ ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకోగా.. తాజాగా హర్యానా కూడా అదే బాటలో పయనిస్తోంది. ఒమిక్రాన్ కేసుల వ్యాప్తి దృష్ట్యా వైరస్‌ నియంత్రణ చర్యలపై హర్యానా సీఎం మనోహర్‌‌ లాల్ ఖట్టర్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆయన కరోనా ఆంక్షలపై ప్రకటన చేశారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు తెలిపారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని ఆయన కోరారు. అలాగే ఇతర సమయాల్లో 200 మందికి మించి పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొన వద్దని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మరోవైపు కరోనా థర్డ్ వేవ్ వచ్చే ముప్పును, ఒమిక్రాన్ వ్యాప్తిని నివారించేందుకు జనవరి 1 నుంచి రెండు డోసుల వ్యాక్సిన్‌ వేసుకున్నోళ్లను మాత్రమే పబ్లిక్ ప్లేసుల్లోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎంవో ప్రకటించింది. మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, ఆఫీసులు, ఫంక్షన్‌ హాళ్లు, బస్సులు సహా అన్ని పబ్లిక్ ప్లేసుల్లోకి వ్యాక్సినేషన్‌ అయినోళ్లనే పర్మిషన్ ఉంటుందని పేర్కొంది.

కాగా, దేశంలో ఇప్పటి వరకు 358 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయని, అందులో 117 మంది పూర్తిగా రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన ఆయన.. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు చెప్పారు. డెల్టా వేరియంట్ కంటే వేగంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1.53 రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ కేసులు డబుల్ అవుతున్నాయని చెప్పారు.