జైళ్లు.. శిక్షలను అమలుచేసే కేంద్రాలు. ‘అంతేనా?’ అంటే కాదు. ఖైదీల ప్రవర్తనల్లో మార్పు తేవాల్సిన ప్రదేశాలు కూడా. ఊచల వెనక ఉన్నవాళ్ల బాగోగుల బాధ్యతా వాటిదే. కానీ.. మన దేశంలో జైలంటే భూలోక నరకమనే బ్యాడ్ ఇమేజ్ ఉంది. దీనికి హర్యానా కాస్త మినహాయింపని చెప్పొచ్చు. అక్కడి జైళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంటుంది. స్టాఫ్, మేనేజ్మెంట్ ఉంటే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయి.
జైలు అంటే చాలు. కొన్ని అభిప్రాయాలు ఆటోమేటిక్‌గా ఏర్పడతాయి. చీకటిగా ఉండే ఇరుకు గదులు, మూలన మంచి నీళ్ల కుండ, తినటానికి కంచం, పడుకోవటానికి చాప, ఒకటో రెండో చెద్దర్లు.. ఇలాంటి సీన్లు కళ్ల ముందు కనిపిస్తాయి. ఇక, జైళ్లలో టాయిలెట్లు ఎంత నీట్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చావక ముందే నరకం చూపించేవి అవేనంటారు. చాలీచాలని పాయిఖానాలు, మురికి కూపాల్లాంటి జైల్ బ్యారెక్స్ ఉంటాయన్నది తెలిసిందే. కూడు కోసం చాంతాడంత క్యూలో నిలబడాలి.ఇలా చెబుతూ పోతే అక్కడ ఉండే సదుపాయాల కన్నా లేనివే ఎక్కువ. ‘జైలుకు వెళ్లొచ్చినా వాడు మారలేదు’ అని ఇందుకే అంటుంటారు. అయితే హర్యానాలోని జైళ్లలో పరిస్థితులు కాస్త బెటర్‌గానే ఉన్నాయి. ఎప్పటికప్పుడు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుచేయటం, వాటి మెయింటెనెన్స్‌ను రెగ్యులర్‌గా చూసుకోవటం, క్లీన్‌గా ఉంచటం వంటి విషయాల్లో ప్రతి జైలూ మంచి మార్కులే పొందాయి. రుచీ పచీ, శుభ్రత లేని తిండి పెడుతున్నారనే కంప్లైంట్లు ఎక్కడా లేవు. సెంట్రల్ జైళ్లు, జిల్లా జైళ్లు అనే తేడా లేకుండా అన్నీ ‘పర్లేదు’ అనే పేరు తెచ్చుకున్నాయి.
ఇవి కూడా ఉంటేనా..
‘హర్యానా జైళ్లలో అంతా బాగానే ఉంది. కానీ..’ అనే కామెంట్స్ వస్తున్నాయి. అంటే సరిచేయాల్సిన లోపాలు కొన్ని ఉన్నాయని దీన్నిబట్టి తెలుసుకోవచ్చు. మెడికల్ రిపోర్టుల్లో ఖైదీల ఒంటి మీద ఉండే గాయాల వివరాలు రాయాలి. మెడికల్ ఎగ్జామినేషన్ల మెయిన్ పర్పస్ ఇదే. దీనిపై వెంటనే ఫోకస్ పెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది. కొన్ని జైళ్లలో మెడికల్ ఆఫీసర్లు రోజూ 80–100 మంది పేషెంట్లను చూస్తున్నారు. దీనివల్ల డాక్టర్లపై పని భారం పడుతోంది. స్పెషలిస్టులు లేని కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోంది. అప్పుడప్పుడూ గోలీల కొరత ఏర్పడుతోంది. జైళ్లలోని ఖైదీలను కుటుంబ సభ్యులు కలవాలంటే వాళ్లకు ఆధార్ కార్డు కంపల్సరీ అని ఈమధ్య రూలు పెట్టారు. ఇది కొందరికి ఇబ్బందికరంగా మారింది. ఖైదీలకు వాళ్ల కేసుల స్టేటస్ ఏంటనేది లాయర్లు వచ్చి చెబితే గానీ తెలియట్లేదు. 20 శాతం మంది ఖైదీలకు లాయర్లు కూడా లేరు. మహిళా ఖైదీల కోసం ప్రత్యేకంగా జైళ్లు ఏర్పాటుచేయాలి. వారికి శానిటరీ ప్యాడ్లు అందట్లేదు. లోకల్ ఖైదీలతో పోల్చితే బంగ్లాదేశ్, నేపాల్, ఆఫ్రికా దేశాల వారిని తక్కువ చూపు చూస్తున్నారనే అసంతృప్తి వ్యక్తమవుతోంది.
‘కామన్’ స్టడీ కనిపెట్టిన లోటుపాట్లు..
హర్యానా జైళ్లలోని స్థితిగతులపై కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్(సీహెచ్ఆర్ఐ), స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కలిసి స్టడీ చేశాయి. ‘ఇన్సైడ్ హర్యానా ప్రిజన్స్’ పేరుతో రిపోర్ట్ ఇచ్చాయి. 2017 డిసెంబర్ నుంచి 2018 మే వరకు జరిగిన ఈ పరిశీలనలో 19 జైళ్లలోని 19 వేల మంది ఖైదీలను నేరుగా కలిసి, మాట్లాడి, అభిప్రాయాలు తీసుకున్నారు. ఇందులో మూడు సెంట్రల్ జైళ్లు, మిగతావి జిల్లా జైళ్లు. మొత్తం మీద 11 జైళ్లలో లిమిట్కి మించి ఖైదీలను బంధించారు. స్టాఫ్ విషయంలో ఓవరాల్‌గా 20 శాతం పోస్టులు వేకెన్సీ ఉన్నాయి.