హర్యానాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఓ వృద్దుడికి లభించే ప్రభుత్వ పథకాలు ఆగిపోయాయి. ఇప్పటి వరకు వస్తున్న వృద్దాప్య ఫించన్ ను అధికారులు ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాదు ఆయుష్మాన్ కార్డ్ కూడా యాక్సెస్ కాలేదు.. ఎందుకంటే అక్కటి ప్రభుత్వం కొత్తగా మరో కార్డు కావాలని నయా రూల్ తీసుకొచ్చింది. పరివార్ పెహచాన్ పత్ర అనే ఏకీకృత గుర్తింపు కార్డు ఉంటేనే పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో 72 ఏళ్ల ఓ తాత నాకు పెళ్లి చేయండి అంలూ ప్రభుత్వ కార్యాలయానికి పెళ్లికొడుకు వేషంలో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాడు. పెళ్లికి.. ఆ కార్డుకు లింకేమనుకుంటున్నారు.. అయితే ఈ స్టోరీ చదవండి.
పేదలకోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది. అయితే వాటికోసం ఆ కాగితం కావాలి..ఈ సర్టిఫికెట్ కావాలి.. రేషన్ కార్డు ఉండాలి.. ఇలా అనేక నియమ నిబంధనలు పెడుతుంటాయి. అయితే వీటిలో ఏది లేకపోయినా ఆ పథకానికి అనర్హులుగా ప్రకటిస్తారు. తాజాగా హర్యానాలో పరివార్ పెహచాన్ పత్ర అనే ఏకీకృత గుర్తింపు కార్డు విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అన్ని ప్రభుత్వ పథకాలు ఒకే గుర్తింపు కార్డు ద్వారా మంజూరు చేస్తారు. అయితే ఈ కార్డును పెళ్లికాని వ్యక్తులకు జారీ చేయమని ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్డు లేకపోతే హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు అనర్హులుగా ప్రకటిస్తారు.
హర్యానా ప్రభుత్వం మంజూరు చేసే ఏకీకృత గుర్తింపు కార్డు (పరివార్ పెహచాన్ పత్ర)కోసం రేవారిలోని నయా గ్రామానికి చెందిన సత్బీర్ ( 72) అనే వృద్దుడు పెళ్లికొడుకు వేషంలో తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. సెహ్రా(సాంప్రదాయ పెళ్లి ముసుగు)ధరించి ప్రభుత్వకార్యాలయానికి ఓ వృద్దుడు వెళ్లడంతో అధికారులు బిత్తరపోయారు.
హర్యానాలోని నయా విలేజ్‌కు చెందిన 72 ఏళ్ల సత్బీర్ ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌కు లేఖ రాశారు. తనకు కుటుంబ గుర్తింపు కార్డు (పరివార్ పెహచాన్ పత్ర) ఇవ్వాలని లేదా తన వివాహానికి ఏర్పాట్లు చేయాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. తనకు కుటుంబ గుర్తింపు కార్డు లేకపోవడంతో తాను ఎదుర్కొంటున్న ఇబ్డందులను లేఖలో పేర్కొన్నారు.
సత్బీర్ భార్య ఆరేళ్ల క్రితం చనిపోయింది. అతని కుమారులు ఇప్పుడు ఢిల్లీలో ఉంటున్నారు. తాను మాత్రం నయా గ్రామంలోని శిథిలమైన గృహంలో కాలం వెళ్లదీస్తున్నాడు. సత్బీర్ కు కుటుంబ ID లేకపోవడంతో అతనికి వృద్ధాప్య పింఛను, ఆయుష్మాన్ కార్డు యాక్సెస్ కాలేదు. దీంతో ముఖ్యమైన పథకాల ప్రయోజనాలను కోల్పోయారు.
పెళ్లి కాకపోతే కార్డు ఇవ్వమని అధికారులు చెప్పడంతో 72 ఏళ్ల వృద్దుడు సత్బీర్ పెళ్లికొడు వేషంలో ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లగా... రేవారి డిప్యూటీ కమీషనర్ అతని సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సత్బీర్ ఈ విషయాన్ని ఒక న్యాయవాది ద్వారా హర్యానా ప్రభుత్వ సీఎస్ కు, చండీగఢ్‌లోని పౌర వనరుల సమాచార శాఖ అధికారికి, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌తో సహా వివిధ శాఖలకు నోటీసులు పంపారు. ఈ విషయంపై న్యాయవాది కైలాష్ చంద్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సత్బీర్ సిద్ధమయ్యారు.
ప్రభుత్వాలు ఏదైనా నిర్ణయం తీసుకొనేముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అధికారం ఉంది కదా అని.. ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకొంటే పేద ప్రజలు ఇబ్బందులు పడతారని గ్రహించాలి. హర్యానా ప్రభుత్వం తీసుకున్న పరివార్ పెహచాన్ పత్ర గుర్తింపు కార్డు మంజూరు విషయంలో ఒంటరిగా ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు..