రైళ్లల్లో హత్యలు చేసే సైకో కిల్లర్ అరెస్ట్

  • 35 రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో ఐదుగురు ఒంటరి మహిళల హత్య
  • సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​లోనూ మహిళ మర్డర్
  • గుజరాత్ పోలీసులకు చిక్కిన సీరియల్ కిల్లర్

సికింద్రాబాద్, వెలుగు: రైళ్లల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలే లక్ష్యంగా అత్యాచారం చేసి చంపేస్తున్న సైకో సీరియల్ కిల్లర్​ రాహుల్​ను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 24వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో ఓ మహిళను హత్య చేసి గుజరాత్ పారిపోయాడు. అక్కడి పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సైకో కిల్లర్​ను పీటీ వారెంట్​పై హైదరాబాద్​కు తీసుకొస్తున్నారు.

ఈ నెల 24న మణుగూరు ఎక్స్​ప్రెస్​లో సికింద్రాబాద్​కు వస్తున్న వెంకట రమణమ్మ (45) అనే మహిళను హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న నగదు, సెల్​ఫోన్ తీసుకుని పారిపోయాడు. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 24 మధ్య ఐదు రాష్ట్రాల్లో.. ఐదు హత్యలు చేశాడు. గుజరాత్ లోని వల్సాద్ రైల్వే స్టేషన్​లో అనుమానాస్పదంగా తిరుగుతున్న రాహుల్​ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో మహిళను హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో వల్సాద్ పోలీసులు సికింద్రాబాద్ జీఆర్​పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

రైల్లో బీడీ కాల్చొద్దన్నందుకు మొదటి హత్య

హర్యానాలోని రోహతక్​కు చెందిన భోలోకరమ్ వీర్ జాట్ అలియాస్ రాహుల్ దివ్యాంగుడు. ఒంటరిగా గడిపేవాడు.సైకో మాదిరి ప్రవర్తిస్తుండటంతో కుటుంబ సభ్యులు కూడా అతన్ని దూరం పెట్టారు. హైవే మీదున్న దాబాల్లో పని చేస్తూ లారీలను దొంగలించడం మొదలుపెట్టాడు.రాజస్థాన్, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రాహుల్​పై 13 కేసులున్నాయి. ఈ ఏడాది మే వరకు రాజస్థాన్​లోని జైల్లో ఉన్నాడు. బెయిల్​పై బయటికొచ్చి గుజరాత్ వెళ్లిపోయాడు. దివ్యాంగుల రైల్వే పాస్​తో రైళ్లల్లో దేశమంతా తిరిగేవాడు. అక్టోబర్ 17న బెంగళూరు–మురుదేశ్వర్ రైల్లో ఫస్ట్ టైమ్ ఓ ప్రయాణికుడిని హత్య చేశాడు. రైల్లో బీడీ కాల్చొద్దన్నందుకు గొంతు నులిమి చంపేశాడు. 

2,500 కెమెరాలు పరిశీలించిన పోలీసులు

కతిహార్ ఎక్స్​ప్రెస్​లో ఓ వృద్ధుడిని,కన్యాకుమారి ఎక్స్​ప్రెస్​లో మహిళను చంపేశాడు. ఉద్వాడా రైల్వే స్టేషన్​లో మరో మహిళను పక్కనే ఉన్న మామిడి తోటలోకి లాక్కెళ్లి రేప్ చేసి హత్య చేశాడు. వల్సాద్ పోలీసులు కేసు మహిళ బ్యాగు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఆయా రైల్వే స్టేషన్లలోని 2,500 సీసీ కెమెరాలను పరిశీలించి రాహుల్​ను గుర్తించారు. 

పీటీ వారెంట్​పై త్వరలో హైదరాబాద్​కు..

కర్నూలుకు చెందిన భరత గోవిందప్ప, వెంకట రమణమ్మ దంపతులు కర్నాటకలోని బళ్లారి జిల్లా సోంపోటు తాలూకా తోర్నగల్​లో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. హైదరాబాద్​లోని జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్న పెద్ద కూతురును చూసేందుకు ఈ నెల 23న రాత్రి 7 గంటలకు తోర్నగల్ రైల్వే స్టేషన్​లో మణుగూరు ప్యాసింజర్ రైలు ఎక్కింది. అదే బోగీలో సైకో కిల్లర్ రాహుల్ ఎక్కాడు. రైలు సికింద్రాబాద్​కు వస్తున్న క్రమంలో రమణమ్మ మెడకు టావెల్ బిగించి హత్య చేశాడు. ఆమె వద్ద ఉన్న రూ.25వేల నగదు, సెల్​ఫోన్ తీసుకుని దిగిపోయాడు.

బాంద్రా–భుజ్ ఎక్స్​ప్రెస్ ఎక్కి సోమవారం గుజరాత్ చేరుకున్నాడు. రమణమ్మ డెడ్​బాడీని దివ్యాంగుల బోగీలో ఆమె బంధువులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదే క్రమంలో గుజరాత్​లోని వల్సాద్ రైల్వే స్టేషన్​లో దిగిన రాహుల్​ను అక్కడి రైల్వే పోలీసులు పట్టుకుని విచారించగా.. నేర చరిత్ర అంతా బయటపడింది. వారం రోజుల్లో అతన్ని హైదరాబాద్​కు తీసుకొస్తామని రైల్వే ఇన్​స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలిపారు.