లక్సరీ లైఫ్‌కు అలవాటు పడ్డ ఓ అండర్ 19 క్రికెటర్ అడ్డదారులు తొక్కాడు. తానొక పేరు మోసిన క్రికెటర్‌నని, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌కు ఆడానని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడ్డాడు. స్టార్ హోటళ్లలో బస చేసి డబ్బులు చెల్లించకుండా తప్పించుకోవడం.. అందమైన అమ్మాయిలతో పరిచయాలు పెంచుకొని వారితో ఎంజాయ్ చేయడం ఇతగాడికి వెన్నతో పెట్టిన విద్య. ఇతని చేతిలో మోసపోయిన వారిలో భారత క్రికెటర్ రిషబ్ పంత్ కూడా ఉన్నారు. చివరకు ఈ మోసగాడు పోలీసులకు పట్టుబడడంతో అతని లీలలన్నీ బయటపడ్డాయి.
హర్యానాకు చెందిన మృనాంక్ సింగ్ అనే 25 ఏళ్ల యువకుడు గతంలో అండర్-19 క్రికెట్ ఆడాడు. ఆ ఫోటోలను పావుగా వాడుకుంటూ ఇతగాడు కనపడ్డవారినల్లా మోసం చేశాడు. తాను ముంబై ఇండియన్స్(2014-2018) మాజీ ఆటగాడినని.. తానెంతో పాపులర్ క్రికెటర్‌నని ఎదుటి వారిని నమ్మించేవాడు. ఇలాంటి మాయమాటలతో ఎంతో మంది అమ్మాయిలను మోసం చేశాడు. కొన్నాళ్ళు వారితో ఎంజాయ్ చేశాక.. నెంబర్ మార్చేస్తుండేవాడు. అంతేకాదు, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేసేందుకు ఇష్టపడే ఈ మాయగాడు కొన్నాళ్ళు అక్కడ బస చేశాక.. బిల్లులు చెల్లించకుండా తప్పింకునేవాడు.
2022లో మృనాంక్ ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్‌లో బస చేశాడు. ఆ సమయంలో బిల్లు రూ.5.5 లక్షలు అవ్వగా కట్టకుండా తప్పించుకున్నాడు. బిల్లు చెల్లించమని హోటల్ సిబ్బంది అడిగితే.. తన స్పాన్సర్ అడిడాస్ కంపెనీ అని.. వారొచ్చి బిల్లు కడతారని చెప్పి అక్కడి నుండి మాయమయ్యాడు. కొన్నిరోజుల అనంతరం హోటల్ సిబ్బంది డబ్బుల కోసం అతని కోసం అనేకసార్లు ఫోన్ చేయగా వారికి కట్టుకథలు చెప్పాడు. చివరకు వారు పోలీసులను ఆశ్రయించడంతో గతేడాది ఆగస్టులో అతనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం మృనాంక్ సింగ్ హాంకాంగ్‌కు పారిపోతుండగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు కూడా తాను సీనియర్ ఐపీఎస్ అధికారినంటూ వారిని బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. అయితే, అప్పటికే అతని లీలలన్నీ వారికి తెలియడంతో అతని వ్యూహాలు పని చేయలేదు. చివరకు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచగా రెండ్రోజుల రిమాండ్ విధించింది.
రిషబ్ పంత్
2020-21లో మృణాంక్ సింగ్.. క్రికెటర్ రిషబ్ పంత్‌ను రూ.1.6 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తాను లగ్జరీ వాచీలు, అభరణాల వ్యాపారం చేసే వ్యాపారవేత్తగా నటిస్తూ అతను పంత్‌ను మోసగించినట్లు తెలుస్తోంది. దీనిపై పాన్ గతేడాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇతగాడిపై దేశంలోని చాలా రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజీ నుంచి కామర్స్‌లో డిగ్రీ చేసిన మృనాల్.. రాజస్థాన్‌లోని ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు.