Ranji Trophy: హర్యానా- ముంబై రంజీ వేదిక మార్పు.. బీసీసీఐ కుట్ర అంటున్న అభిమానులు!

Ranji Trophy: హర్యానా- ముంబై రంజీ వేదిక మార్పు.. బీసీసీఐ కుట్ర అంటున్న అభిమానులు!

హర్యానా, ముంబై మధ్య జరగాల్సిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్ విమర్శలకు దారితీస్తోంది. అందుకు కారణం.. వేదిక మార్చటమే. శనివారం(ఫిబ్రవరి 8) నుంచి హర్యానా సొంత వేదిక లాహ్లీలో మ్యాచ్ జరగాల్సి ఉండగా.. దానిని బీసీసీఐ కోల్‌కతాకు తరలించింది. ఈ నిర్ణయం ఆతిథ్య హర్యానా జట్టు ప్రణాళికలను దెబ్బతీసింది. 

సొంతవేదికపై మ్యాచ్ ఆతిథ్య జట్టుకు ఎంతో కొంతో లాభం చేకూరుతుంది. ఇప్పుడు కోల్‌కతాకు తరలించడం వల్ల ముంబైకు అనుకూలం అనేది హర్యానా అభిమానుల వాదన. ముంబై జట్టుకు లబ్ది చేకూర్చాలనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు వస్తున్నాయి. వేదిక మార్పుకు గల కారణం ఏంటనేది బీసీసీఐ చెప్పకపోవడం కొసమెరుపు. 

ఈ విషయంపై ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అజింక్య నాయక్ స్పందించారు. "అవును, హర్యానాతో జరిగే మా క్వార్టర్ ఫైనల్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుందని బీసీసీఐ నుండి మాకు సమాచారం అందింది.." అని పీటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఎందుకు వేదిక మార్పు అని మీడియా ప్రశ్నించగా సమాధానం దాట వేశారు. 

Also Read :  ఆ ఇద్దరిలో ఒకరికి కెప్టెన్సీ

ఈ మ్యాచ్‌లో ముంబై తరుపున భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్ రౌండర్ శివం దుబే పాల్గొననున్నారు.

పొగమంచు..!

నివేదికల ప్రకారం, గత కొన్ని రోజులుగా లాహ్లిలో వాతావరణం అస్పష్టంగా ఉందని తెలుస్తోంది. ఉదయం 12 గంటలు దాటితే కానీ, పొగమంచు వీడట్లేదని సమాచారం. అదే జరిగితే, క్వార్టర్ ఫైనల్‌ డ్రాగా ముగుస్తుందని బీసీసీఐ అభిప్రాయపడిందట. అందువల్లే మ్యాచ్‍ను కోల్‌కతాకు తరలించారట. ఇది ఎంత వరకూ నిజమనేది బీసీసీఐయే స్పష్టం చేయాలి.