వామ్మో.. అనుమానానికే ఇంత దారుణమా..? బతికుండగానే యోగా టీచర్‏ను 7అడుగుల లోతులో పాతిపెట్టిన దుండగులు

వామ్మో.. అనుమానానికే ఇంత దారుణమా..? బతికుండగానే యోగా టీచర్‏ను 7అడుగుల లోతులో పాతిపెట్టిన దుండగులు

ఛండీఘర్: హర్యానా రాష్ట్రంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ యోగా టీచర్‎ను బతికుండగానే ఏడు అడుగుల లోతులో పాతిపెట్టాడు మహిళ భర్త. దాదాపు మూడు నెలలుగా కనిపించకుండా పోయిన యోగా టీచర్ కోసం పోలీసుల దర్యా్ప్తు చేయడంతో ఈ షాకింగ్ ఘటన బయటపడింది. పోలీసుల వివరాల ప్రకారం.. రోహ్తక్‌లోని బాబా మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయంలో జగదీప్ (45) అనే వ్యక్తి యోగా టీచర్‎గా పని చేస్తున్నాడు. మూడేళ్లుగా వర్శిటీకి సమీపంలోని జనతా కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. జగదీప్ అద్దెకు ఉండే ఇంటి యాజమాని అల్లుడు రాజ్ రాజ్‌కరణ్ (40) అనే వ్యక్తి తన భార్యతో జగదీప్‎కు అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం పెంచుకున్నాడు. 

ALSO READ | సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారికి జీవిత ఖైదు..

జగదీప్ ఫోన్‌లో తన భార్య ఫోటో కనిపించడంతో మరింత ఆగ్రహంతో రగిలిపోయిన రాజ్‎కరణ్.. ఎలాగైన జగదీప్‎ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ప్లాన్ ప్రకారం తన స్నేహితులతో కలిసి జగదీప్‎ను కిడ్నాప్ చేసి చార్ఖీ దాద్రి జిల్లాలో పైంటావాస్ కలాన్‌లోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి బతికుండగానే జగదీప్‎ను ఏడు అడుగుల గుంతలో పాతిపెట్టారు. దాదాపు మూడు నెలలుగా జగదీప్ కనిపించకపోవడంతో అతడి మామ2024, డిసెంబర్ 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జగదీప్ మామ ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రాజ్ కరణ్ అతడి స్నేహితులు కలిసి జగదీప్‎ను కిడ్నాప్ చేసిన వీడియోను పోలీసులు గుర్తించారు. 

దీంతో నిందితులను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించగా అసలు నిజం బయటపడింది. తన  భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే జగదీప్‎ను హత్య చేసినట్లు పోలీసులు ఎదుట రాజ్ కరణ్ నేరం అంగీకరించాడు. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా ఏఎస్పీ శశి శేఖర్ నేతృత్వంలోని పోలీసు బృందం, ఐపీఎస్ అధికారి దివ్యాన్షి సింగ్లా పర్యవేక్షణలో CIA, FSL బృందాలు, స్థానిక పోలీసులతో కలిసి సంఘటన స్థలంలో జగదీప్ మృతదేహాన్ని వెలికితీశారు. జగదీప్‎ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేశామని.. మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. అనుమానానికే ఇంత దారుణానికి పాల్పడుతారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.