ఇండ్లు కట్టి నాలుగేండ్లు..ఒక్కరికీ ఇయ్యలే

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో డబుల్​బెడ్​ రూమ్​ ఇండ్లు కట్టి నాలుగేళ్లయింది. లబ్ధిదారుల ఎంపిక కోసం డ్రా తీసి కూడా మూడునెలలు గడిచాయి. అయినా నేటి వరకు అర్హులైన వారికి ఇండ్లు పంపిణీ చేయలేదు. దీంతో లబ్ధిదారులు, తమకు ఇండ్లు ఎప్పుడిస్తారా అని ఎదురు చూస్తున్నారు.కామారెడ్డి టౌన్​తో పాటు, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో కలిపి మొత్తం 712 డబుల్​బెడ్ ​రూమ్​ ఇండ్లు కట్టారు. రాజీవ్​నగర్ ​కాలనీలో 25 బ్లాకుల్లో 300 ఇండ్లు, రామేశ్వర్​పల్లి సమీపంలో 200, దేవునిపల్లి, టెక్రియాల్, ఇల్చిపూర్​ శివార్లలో 212 ఇండ్లను నిర్మించారు. కొన్ని ఇండ్లు 2018 వరకు కంప్లీట్​కాగా, మరి కొన్ని 2020 లో కంప్లీటయ్యాయి. ఇండ్ల నిర్మాణం పూర్తయినా, మౌలిక వసతులు కల్పించలేదు.

 సౌలత్​ల కోసం స్పెషల్​ఫండ్స్​ కోసం ప్రయత్నాలు చేసినా, రిలీజ్​కాలేదు. దీంతో కరెంట్​లైన్,  డ్రైనేజీ, సీసీ రోడ్లు, వాటర్​సప్లయ్​ పైపులైన్లు, సెప్టిక్​ట్యాంకుల నిర్మాణం కోసం మున్సిపాలిటీ ఫండ్స్​తో పాటు,  టౌన్ డెవలప్​మెంట్ కోసం సీఎం ప్రకటించిన స్పెషల్​ఫండ్స్​ నుంచి కేటాయించి పనులు చేపట్టారు. ఇండ్ల నిర్మాణం కంప్లీటై ఏండ్లు గడుస్తున్నా, అర్హులైన వారికి కేటాయించకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని నెలల కింద అర్హులకు ఇండ్లు కేటాయించాలని బీజేపీ లీడర్లు పెద్దఎత్తున ఆందోళన చేశారు. మళ్లీ ఎలక్షన్​ వస్తుండడంతో ఇండ్ల పంపిణీ ప్రక్రియను మూడునెలల కింద షూరు చేశారు. డబుల్​బెడ్​రూమ్​ ఇండ్ల కోసం దరఖాస్తులు ఆహ్వానించగా 5,047 అప్లికేషన్లు వచ్చాయి. వార్డుల వారీగా విభజించి సర్వే చేశారు. సమగ్ర కుటుంబ సర్వే (ఎస్​కెఎస్) ఆధారంగా 3,450 మందిని అర్హులుగా గుర్తించారు. అర్జీలు వేల సంఖ్యలో ఉండగా, ఇండ్లు వందల్లో ఉండడంతో డ్రా తీయాలని ఆఫీసర్లు నిర్ణయించారు.

మార్చిలో డ్రా తీసిన్రు

వార్డుల వారీతో పాటు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోటా ప్రకారం 712 ఇండ్ల కోసం మార్చిలో  అర్జీదారుల సమక్షంలో ఆఫీసర్లు డ్రా తీశారు. మూడు నెలలు దాటినా ఇప్పటికీ డబుల్​బెడ్​రూమ్ ​ఇండ్లను సెలక్టయిన లబ్ధిదారులకు అప్పగించలేదు. దీంతో ఇండ్లు రాని వారు, డ్రాలో ఇండ్లు వచ్చిన వారు కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రామేశ్వర్​పల్లి, టెక్రియాల్​వద్ద డ్రైనేజీలు, సెప్టిక్​ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి చేశారు. రాజీవ్​నగర్​ కాలనీ వద్ద పనులు షూరువయ్యాయి. ఇండ్ల నిర్మాణం కంప్లీటై​ ఏండ్లు గడుస్తుండడం,  నిరూపయోగంగా ఉండడంతో శిథిలమవుతున్నాయి. టెక్రియాల్ లో ఇటీవల ఇండ్ల నిర్మాణంలోని నాణ్యత  డొల్లతనం బయట పడింది. ఈ అంశం అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.