హాస్టళ్ల తీరు మారదా? : చింతకింది సంతోష్

గతంలో ఎన్నడూ లేని విధంగా గురుకులాలను నెలకొల్పి ఒక్కో స్టూడెంట్​మీద రూ లక్ష వరకు ఖర్చు పెడుతూ.. విద్యార్థులను చదివిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. సంక్షేమ హాస్టళ్ల సమస్యలను మాత్రం గాలికొదిలేస్తున్నారు. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఓ చోట ఫుడ్​పాయిజనై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు జరుగుతూనే ఉన్నా.. సర్కారు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సర్కారు గురుకులాలు ఏర్పాటు చేసింది కదా అని రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద కుటుంబాలు వారి పిల్లలను గురుకులాల్లో వేశారు. ఇలా రాష్ట్రంలో 669 ఎస్సీ హాస్టల్స్, 419 ప్రిమెట్రిక్ హాస్టల్స్, 340 ఎస్టీ హాస్టల్స్, 278 బీసీ మెట్రిక్ పోస్ట్ హాస్టల్స్, 326 ఆశ్రమ పాఠశాలు ఉన్నాయి. వీటన్నిటిలో కలిపి సుమారు ఐదు లక్షల 50 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గురుకులాల్లో సుమారు మూడు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సర్కారును నమ్మి ఇంత పెద్ద మొత్తంలో స్టూడెంట్లు హాస్టళ్లలో చేరితే.. ప్రభుత్వం వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదు. భోజనం సరిగా పెట్టక, తాగు నీరు, మరుగుదొడ్లు, గదులు, మంచాలు, బెడ్​షీట్లు లాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఇటీవలి ఘటనలు

రాష్ట్రంలో ఈ ఒక్క ఏడాదిలోనే అనేకచోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు నమోదయ్యాయి. వందలాది మంది స్టూడెంట్లు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలయ్యారు. మెదక్ జిల్లాలోని ఓ గురుకులంలో ఫుడ్​పాయిజనై 27 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. మహబూబ్​నగర్ జిల్లాలో12 మంది, హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో 8 మంది, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో బల్లి పడ్డ కూర తిని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మానుకోటలో ఉన్న గురుకులాల్లో అన్నంలో బొద్దింకలు, పప్పులో వానపాములు వచ్చాయి. ఆ ఫుడ్​తిన్న 37 మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. సిద్దిపేట జిల్లా, ఆసిఫాబాద్, మెదక్, నిజామాబాద్ ఇలా ప్రతీ జిల్లాలో సరైన భోజనం పెట్టక విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ప్రభుత్వంపై నమ్మకంతో గురుకులాల్లో చేర్పిస్తే.. కనీసం భోజనం కూడా సరిగా పెట్టరా? అంటూ విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో ఫుడ్​పాయిజన్ ​కేసులు నమోదవుతున్నా.. రాష్ట్ర మంత్రి, విద్యా శాఖ అధికారులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్​ఆఫీసర్లు కనీసం సమీక్ష నిర్వహించడం లేదు. ఫుడ్​పాయిజన్​కేసులు రావొద్దని జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో సమీక్ష నిర్వహించి హెచ్చరించే ప్రయత్నం జరగడం లేదు. మార్కెట్​రేట్లను బట్టి మెస్​చార్జీలు పెంచితేనే సంబంధిత కాంట్రాక్టర్లు కూడా నాణ్యమైన సరుకులు పంపిణీ చేయగలడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల పోరాట పటిమ అందరికి తెలిసిందే. ఇప్పుడు స్వరాష్ట్రంలో నాణ్యమైన విద్య, హాస్టళ్ల సంక్షేమం కోసం మరోసారి ఉద్యమం చేయాల్సి వస్తుంది.

నాణ్యత లేని సరుకులు

రాష్ట్ర ప్రభుత్వం గతంలో విద్యార్థులకు సన్నబియ్యం పంపిణీ చేసేది. కరోనా తర్వాత పరిస్థితి మారింది. సన్న బియ్యం సరిగా రావడం లేదు. ముక్కిన బియ్యం, లేదంటే బియ్యంలో పురుగులు ఉంటున్నాయి. ఆ బియ్యంతో వండిన అన్నం తినలేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఇక మిగతా సరుకుల పంపిణీలోనూ కోత విధిస్తున్నది.10 కేజీల పప్పు ఉండాల్సిన చోట కేవలం 5 కిలోలతోనే సరిపెడుతున్నది. మార్కెట్​రేట్ల ప్రకారం మెస్​చార్జీలు పెంచకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్​నాణ్యత లేని సరుకులు, కుళ్లిన కూరగాయలు సరఫరా చేస్తున్నాడు. నిర్వాహకులు వాటితోనే వంట చేసి విద్యార్థులకు పెడుతున్నారు. ఆ భోజనం తింటున్న విద్యార్థులకు ఫుడ్​పాయిజనవుతున్నది. పురుగుల అన్నం, నీళ్ల చారు, బల్లులు, కప్పలు పడిన భోజనం తినాల్సి వస్తున్నది. ఇలా నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా వండిన భోజనం పెట్టి ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్నది. తరచూ సంక్షేమ హాస్టళల్లో పదుల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ కేసులు వస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. 

- చింతకింది సంతోష్, ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్