150 కిలోల గంజాయి పట్టివేత.. 8 మంది అరెస్ట్, 4 కార్లు, బైక్‌‌ స్వాధీనం

హసన్‌‌పర్తి, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను హసన్‌‌పర్తి పోలీసులు గురువారం పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ డేవిడ్‌‌రాజు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... హసన్‌‌పర్తి సీఐ తుమ్మ శ్రీధర్‌‌, ఎస్సై సురేశ్‌‌ ఆధ్వర్యంలో పోలీసులు గురువారం పెట్రోలింగ్‌‌ నిర్వహిస్తుండగా ఎల్లాపూర్‌‌ గ్రామ శివారులో ఐదు కార్లలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసిన నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు వెంబడించారు.

ఓ కారులో కొందరు వ్యక్తులు తప్పించుకోగా మరో 8 మందిని పట్టుకున్నారు. తనిఖీ చేయగా 150 కిలోల ఎండు గంజాయి దొరికింది. దీంతో చిన్నవంగర వనపు తండాకు చెందిన ధరావత్‌‌ రవి, వరంగల్‌‌ దేశాయిపేటకు చెందిన చిలుక సురేశ్‌‌, తొర్రూర్‌‌ అమర్‌‌సింగ్‌‌ తండాకు చెందిన గుగులోతు హరిసింగ్, జాటోతు చంద్రు, చంద్రు, మహారాష్ట్రలోని అమరావతి ఆజాద్‌‌నగర్‌‌కు చెందిన సలావుద్దీన్, సలావుద్దీన్ షేక్ సమీర్‌‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పారిపోయిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు. నిందితుల నుంచి నాలుగు కార్లు, ఏడు సెల్‌‌ఫోన్లు, బైక్‌‌ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.