‘పుష్ప’ స్టైల్‌‌‌‌‌‌‌‌లో గంజాయి స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌

‘పుష్ప’ స్టైల్‌‌‌‌‌‌‌‌లో గంజాయి స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌
  •     ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ కింద ప్రత్యేక బాక్స్‌‌‌‌‌‌‌‌, కారులో లాకర్లు ఏర్పాటు చేసి రవాణా
  •     వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో రూ. 85 లక్షల విలువైన 338 కిలోలు..
  •     హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు వద్ద రూ. 33 లక్షల విలువైన 86 కిలోల గంజాయి పట్టివేత

వరంగల్, వెలుగు : పుష్ప సినిమాలో చూపిన మాదిరిగా ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ కింద గంజాయి పెట్టి రవాణా చేస్తున్న వ్యక్తిని గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని హసన్‌‌‌‌‌‌‌‌పర్తి, యాంటీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ టీం పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వరంగల్‌‌‌‌‌‌‌‌ సీపీ అంబర్‌‌‌‌‌‌‌‌ కిశోర్‌‌‌‌‌‌‌‌ ఝా మీడియాకు వెల్లడించారు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వై రామవరం పాతకోటకు చెందిన కిలో లక్ష్మీనారాయణ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నాడు. 

అల్లూరి సీతారామారాజు జిల్లాకు చెందిన నారాయణ అనే వ్యక్తి సూచనతో లక్ష్మీనారాయణ  ఈ నెల 17న ఒడిశాలోని చిత్రకొండ మండలం నాటుగురులో 338 కిలోల గంజాయిని కొని దానిని 96 ప్యాకెట్లుగా మార్చాడు. అనంతరం ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ ట్రాలీ కింద మరో డబ్బాను ఏర్పాటు చేసి అందులో గంజాయి ప్యాకెట్లను భద్రపరిచాడు. తర్వాత భద్రాచలం, ములుగు, హనుమకొండ, సిద్దిపేట మీదుగా కామారెడ్డి జిల్లా బికనూర్‌‌‌‌‌‌‌‌ మండలం ధారకొండకు వెళ్తున్నాడు. 

ఈ క్రమంలో హనుమకొండ జిల్లా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి మండలం అనంతసాగర్‌‌‌‌‌‌‌‌ క్రాస్‌‌‌‌‌‌‌‌రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న ఎస్సై దేవేందర్‌‌‌‌‌‌‌‌ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ను ఆపి తనిఖీ చేశాడు. ట్రాలీ కింద ప్రత్యేకంగా డబ్బా ఉండడం, అందులో భారీ మొత్తంలో గంజాయి కనిపించడంతో లక్ష్మీనారాయణను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 85 లక్షలు ఉంటుందని, గంజాయి తీసుకురావాలని చెప్పిన నారాయణతో పాటు

తెప్పించుకుంటున్న వ్యక్తి పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. యాంటీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ విభాగం ఏసీపీ సైదులు, కాజీపేట ఏసీపీ తిరుమల్‌‌‌‌‌‌‌‌, యాంటీ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ సురేశ్‌‌‌‌‌‌‌‌, హసన్‌‌‌‌‌‌‌‌పర్తి ఇన్‌‌‌‌‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ చేరాలు, ఎస్సై దేవేందర్‌‌‌‌‌‌‌‌ను సీపీ అభినందించారు.   

కారులో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసి...

జీడిమెట్ల/హైదరాబాద్‌‌‌‌‌‌‌‌సిటీ, వెలుగు : కారులో ప్రత్యేక లాకర్లు ఏర్పాటు చేసుకొని గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ, దుండిగల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.33 లక్షల విలువైన 86 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌‌‌‌‌‌‌‌ డీసీపీ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లా ఉదయగిరికి చెందిన సునీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ గంజాయి రవాణాకు ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఇందులో భాగంగా బీరజ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన రాజుతో కలిసి గంజాయి స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ చేసేవాడు. ఈ క్రమంలో తన హోండా సిటీ కారులో ప్రత్యేకంగా లాకర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ నెల 18న రాజు సూచనలతో శివ అనే వ్యక్తి సునీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ కారు తీసుకొని బీరంపూర్‌‌‌‌‌‌‌‌ వెళ్లి అక్కడ 86 కిలోల గంజాయి కొని కారులోన ప్రత్యేక లాకర్లలో భద్రపరిచాడు. 

19వ తేదీన చింతూరు వద్ద కారును సునీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చి గంజాయిని ఢిల్లీలోని అమిత్‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌కు అందజేయాలని సూచించాడు. దీంతో సునీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌ పోలీసులను పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతో మల్కన్‌‌‌‌‌‌‌‌గిరి జిల్లాకు చెందిన లక్ష్మి అనే మహిళను తన భార్యగా నటించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. మార్గమధ్యలో ఎక్కడైనా పోలీసులు కారును ఆపితే తన ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ కోసం ఢిల్లీ వెళ్తున్నామని నమ్మించేలా ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేశాడు. తర్వాత కారు తీసుకొని చింతూరు నుంచి బయలుదేరాడు. 

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌ ఎస్‌‌‌‌‌‌‌‌వోటీ, దుండిగల్‌‌‌‌‌‌‌‌ పోలీసులు ఔటర్‌‌‌‌‌‌‌‌ రింగ్‌‌‌‌‌‌‌‌ రోడ్డు ఎగ్జిట్‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌ 5 వద్ద కారును ఆపి సునీంద్రకుమార్‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌, లక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని లాలాపేట్‌‌‌‌‌‌‌‌, ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌ ఏరియాల్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తులను ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఒడిశాలోని మల్కాన్‌‌‌‌‌‌‌‌గిరి ప్రాంతానికి చెందిన అకాశ్‌‌‌‌‌‌‌‌మాడి అనే వ్యక్తి శుక్రవారం ఎల్‌‌‌‌‌‌‌‌బీనగర్‌‌‌‌‌‌‌‌లో గంజాయి అమ్ముతున్నాడు.

 గమనించిన ఎస్‌‌‌‌‌‌‌‌టీఎఫ్‌‌‌‌‌‌‌‌ ఎస్సై బాలరాజు అతడిని పట్టుకొని 5.155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో లాలాగూడలో గంజాయి అమ్ముతున్న ఎలిశా బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని 1.700 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.