హసన్‌పర్తి, వెలుగు : హైవేలపై దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను హసన్‌పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కాజీపేట ఏసీపీ డేవిడ్‌రాజు సోమవారం హసన్‌పర్తిలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... పరకాల మండలం కామారెడ్డిపల్లికి చెందిన తిక్క యశ్వంత్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం శాంపేటకు చెందిన దారంగుల అంజి ప్రస్తుతం హనుమకొండలో ఉంటున్నారు. వారు హనుమకొండ బాలసముద్రంకు చెందిన కుమ్మరి రాజేశ్‌తో కలిసి ముఠాగా ఏర్పడి హైవేలపై దోపిడీలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డు పైగల కోమటిపల్లి టోల్‌ప్లాజా వద్ద పార్కింగ్ చేసిన లారీలో డ్రైవర్‌ను బెదిరించి రూ. 35 వేలు, సెల్‌ఫోన్, చింతగట్టు సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద లారీని ఆపి డ్రైవర్‌ను కొట్టి స్మార్ట్ ఫోన్, రూ. 30 వేలు ఎత్తుకెళ్లారు. అలాగే హసన్‌పర్తి చెరువు కట్ట సమీపంలోని పెట్రోల్‌బంక్‌లో సిబ్బంది సెల్‌ఫోన్లను దొంగిలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. సోమవారం ఉదయం హసన్‌పర్తి శివారులో పోలీసులు
వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించడంతో చోరీల విషయం బయటపడింది. ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 3 వేలు, నాలుగు సెల్‌ఫోన్స్, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ చెప్పారు. కార్యక్రమంలో సీఐ తుమ్మ గోపి, ఎస్సై రాజు, కానిస్టేబుల్స్ క్రాంతికుమార్, మధు పాల్గొన్నారు.