చరాస్ పేస్ట్‌‌ .. చటాక్‌‌ రూ.20 వేలు!

  • హాష్ ఆయిల్ 5 ఎంఎల్​ రూ. 7 వేలు
  • గంజాయి నుంచి తయారీ
  • యాదాద్రిలో జోరుగా సాగుతున్న దందా
  • వారం కింద హాష్‌‌ అయిల్‌‌తో పట్టుబడిన ఇద్దరు
  • తాజాగా చరాస్ పేస్ట్‌‌తో దొరికిన ఆరుగురు

యాదాద్రి, వెలుగు: యాదాద్రిలో గంజాయి నుంచి తయారు చేసే హాష్ ఆయిల్, చరాస్ పేస్ట్ దందా జోరుగా కొనసాగుతోంది. కొందరు స్మగ్లర్లు యూత్‌‌‌‌ను టార్గెట్‌‌‌‌ చేసుకొని కొత్త మార్గాల్లో డ్రగ్స్‌‌‌‌కు అడిక్ట్ చేస్తున్నారు.  ఇందుకోసం టీమ్‌‌‌‌లను ఏర్పాటు చేసుకొని దందా చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 4న మహబూబాబాద్​ జిల్లా గూడురుకు చెందిన అజ్వీరా సూర్య హాష్‌‌‌‌ ఆయిల్ సరఫరా చేస్తూ పట్టుపడగా.. తాజాగా చరాస్ పేస్ట్‌‌‌‌తో ఆరుగురు వ్యక్తులు దొరికారు.  

బుధవారం యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో బోయన్​పల్లి, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్​కు చెందిన 20 నుంచి 26 ఏండ్ల వయసున్న ఆరుగురు యువకులు మూడు బైక్​లపై స్పీడ్​గా చక్కర్లు కొడుతున్నారు.  వాళ్లు మత్తులో ఉండడాన్ని గమనించిన పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా.. మరింత స్పీడ్​ పెంచారు. దీంతో ఎస్సై రమేశ్ ఆధ్వర్యంలో వారిని వెంబడించి పట్టుకున్నారు. సోదా చేయగా ఛరాస్ పేస్ట్​​ దొరికింది.  దీంతో వారిని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు.  వారి వద్ద ఉన్న సెల్​ ఫోన్ల ఆధారంగా ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో తెలుసుకునే పనిలో పడ్డారు. 

యాదాద్రి మీదుగా రవాణా

యాదాద్రి జిల్లా మీదుగా గంజాయితో పాటు హాష్​ ఆయిల్, చరాస్ పేస్ట్‌‌‌‌ పెద్ద మొత్తంలో రవాణా జరుగుతోందని ఇటీవల జరిగిన సంఘటలను బట్టి తెలుస్తోంది.  ఆంధ్రా, --ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లోని అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు జరుగుతోంది.  ప్రధానంగా ఒడిషాలోని మల్కాన్​గిరి నుంచి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు ఈ మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నామని  పోలీసులకు చిక్కిన నిందితులు విచారణలో వెల్లడిస్తున్నారు. అయితే ఎంతమందిని అరెస్ట్​ చేస్తున్నా.. రవాణా మాత్రం ఆగడం లేదు.   విజయవాడ, వరంగల్​ హైవేల మీదుగా తరలుతున్న వందల క్వింటాళ్ల గంజాయి,  లీటర్ల కొద్ది హాష్​ ఆయిల్​ ఎస్‌‌‌‌వోటీ పోలీసులకు పట్టుబడింది. ఈ ఏడాదిలో 8 మత్తు పదార్థాలు పట్టుబడిన కేసులు నమోదయ్యాయి.

గంజాయి నుంచి తయారీ

గంజాయిని రవాణా చేయడం ఇబ్బందిగా మారడంతో స్మగ్లర్లు హాష్ అయిల్, చరాస్ పేస్ట్‌‌‌‌గా మార్చి రవాణా చేస్తున్నారు. వీటి ధర కూడా గంజాయి  కన్నా ఎక్కువ కావడం గమనార్హం.  50 కిలోల గంజాయి నుంచి లీటర్​ హాష్​ ఆయిల్​తీస్తారని పోలీసులు చెబుతున్నారు. 50 కిలోల గంజాయిని రూ. లక్షకు కొనుగోలు చేసే అక్రమార్కులు.. దాని నుంచి వచ్చే లీటర్​హాష్​ ఆయిల్​ను రూ. 13 లక్షలకు,   5 ఎంఎల్​ను రూ. 7 వేలకు పైగా విక్రయిస్తున్నారు. జిందా తిలిస్మాత్​ మాదిరిగా కన్పించే ఆయిల్​ మూడు చుక్కలను సిగరెట్​లో వేసి పీలిస్తే.. మత్తు నశాలానికి ఎక్కుతుందని, దీనికి అలా బానిసలుగా మారుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు.  అదే విధంగా గంజాయి మొక్కల నుంచి వచ్చే గమ్​తో ఛరాస్ పేస్ట్​ తయారు చేస్తున్నారు. 50 గ్రాముల పేస్ట్​ ఖరీదు రూ. 20 వేలకు పైగా ఉంటుంది. దీనిని కూడా సిగరెట్​లోని పొగాకును బయటకు తీసి దానిలో కలిపి పీలుస్తూ మత్తులో మునిగిపోతున్నారు. 

యువతే లక్ష్యంగా విక్రయాలు

నగర శివారు ప్రాంతాల్లోని యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. యాదాద్రి జిల్లా హైదరాబాద్​కు చేరువలో ఉండడమే కాదు ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ, తదితర వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. భువనగిరి, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ లోని కాలేజీల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్​ ఇక్కడ చదువుకుంటున్నారు. ఈ స్టూడెంట్స్​టార్గెట్‌‌‌‌గా గంజాయి, హాష్​ ఆయిల్, చరాస్ పేస్ట్‌‌‌‌ విక్రయిస్తున్నారు.  

కొత్త పద్దతుల్లో రవాణా

గంజాయి, హాష్​ ఆయిల్​ రవాణాలో స్మగ్లర్లు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. గంజాయి ప్యాకెట్లను కారు డిక్కీల్లో, సీట్ల కింద దాచిపెట్టి రవాణా చేస్తున్నారు. ఇటీవల కొబ్బరి బోండాల లోడుతో వెళ్తున్న డీసీఎంలో ప్యాకెట్లను రవాణా చేస్తూ పట్టుపడ్డారు. మరో సంఘటనలో ఏకంగా డీసీఎం అడుగు భాగంలో బాక్స్​ ఏర్పాటు చేసి రవాణా చేశారు. హాష్​ ఆయిల్​ను మాత్రం చిన్న చిన్న ప్లాస్టిక్​ సీసాలతో పాటు ప్లాస్టింగ్​ బ్యాగుల్లో 100 నుంచి 250  ఎంఎల్​ ప్యాక్​ చేసి రవాణా చేస్తున్నారు. 

ఏడాది  నుంచి పదేండ్ల శిక్ష

మత్తు పదార్థాలను అమ్మేవాళ్లే  కాదు.. వాడేవారిపై కూడా నిఘా పెడుతున్నం. గంజాయి సహా మత్తు పదార్థాలను అమ్మేవారి నేరం రుజువైతే ఏడాది నుంచి 10 ఏండ్ల జైలు  శిక్ష పడుతుంది. మత్తు పదార్థాలను వాడే వారిని రిహాబిటేషన్​ సెంటర్​కు పంపిస్తాం. చరాస్​ పేస్ట్​తో దొరికిన ఆరుగురు యువకుల్లో డాకూరి యాదగిరి ఇటీవలే రాంగోపాల్​ పేట పోలీసులకు దొరికి.. బెయిల్​పై బయటకు వచ్చాడు.  

రాజేశ్​ చంద్ర, డీసీపీ, యాదాద్రి