
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందని తేలిపోయింది. ఈ ఉగ్రదాడిలో కీలకంగా వ్యవహరించిన పాకిస్తానీ టెర్రరిస్ట్ హసీం మూసా గతంలో పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేక బలగాల్లో పారా కమాండోగా పనిచేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం లష్కరే ఈ-తోయిబాలో యాక్టివ్గా ఉన్న ఈ ఉగ్రవాది పూర్వాపరాలు ఆరా తీయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఉగ్రవాదికి పాకిస్తాన్ స్పెషల్ ఫోర్సెస్లో ఒకటైన స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) నుంచి లోన్ కూడా అంది ఉండొచ్చని భారత భద్రతా దళాల అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
కోవర్ట్ ఆపరేషన్స్ చేయడంలో పాకిస్తాన్ SSG పారా కమాండోలకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పహల్గాం ఉగ్రదాడితో సహా ఈ హసీం మూసా కశ్మీర్లో జరిగిన మూడు ఉగ్ర దాడుల్లో కీలకంగా వ్యవహరించాడు. 2024 అక్టోబర్లో గగన్ గిర్, గండ్రేబల్లో ఉగ్రవాదులు ఒక డాక్టర్తో సహా ఆరుగురు నాన్ లోకల్స్ను కాల్చి చంపేశారు. బుటా పత్రి, బారాముల్లాలో ఇద్దరు ఆర్మీ జవాన్లు, ఇద్దరు ఆర్మీ పోర్టర్లు కూడా 2024లో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందారు.
పహల్గాంతో సహా ఈ మూడు ఉగ్ర దాడుల్లో పాకిస్తానీ టెర్రరిస్ట్ హసీం మూసా కీలక సూత్రధారి. కశ్మీర్కు వచ్చే నాన్ లోకల్స్ను టార్గెట్ చేయడమే లష్కరే ఈ తోయిబా ఇతనికి అప్పజెప్పిన ప్రధాన విధి. లోకల్స్లో కలిసిపోయి పహల్గాం ప్రాంతంలో పక్కాగా రెక్కీ చేశాడు. బైసరన్ లోయ పర్యాటకులతో కళకళలాడుతుండగా 26 మందిని పొట్టనపెట్టుకుని భారత్కు తీరని శోకాన్ని మిగిల్చాడు.
హసీం మూసాకు పాక్ ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలియడంతో పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ పాత్ర ఉందన్న వాదనకు మరింత బలం చేకూరింది. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంటే, అమాయక ప్రజలపై ఉగ్రవాదులు నరమేధం సృష్టిస్తూ రెచ్చిపోతున్నారని ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్తాన్ వైఖరిని భారత్ ఏకి పారేసింది.