దేశమంతా ఓ వైపు ఐపీఎల్ హడావుడిలో ఉంటే టీమిండియా ఫాస్ట్ బౌలర్ మాత్రం ఈ మెగా లీగ్ కు దూరమయ్యాడు. భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ గాయం కారణంగా భారత జట్టుకు ఆడాడు. ఇటీవలే విదేశాలకు వెళ్లి సర్జరీ చేయించుకున్న ఈ సీనియర్ ఫాస్ట్ బౌలర్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ తో పాటు జూన్ లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు.
నివేదికల ప్రకారం షమీ ఆగస్టులో బంగ్లాదేశ్ తో జరగనున్న టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అసలే గాయం కారణంగా ఇబ్బంది పడుతున్న షమీపై అతని భార్య హసిన్ జహాన్ సంచలన ఆరోపణలు చేసింది. "నన్ను చంపాలని షమీ ప్లాన్ చేస్తున్నాడు. ఉత్తర్ప్రదేశ్ పోలీసులు, బీజేపీ సర్కారు సాయంతో నన్ను మర్డర్ చేసేందుకు పథకాన్ని రచిస్తున్నాడు. ఇప్పటివరకు నాకు న్యాయం జరగలేదు.
సుప్రీం కోర్టుకు వెళ్తే కేసును వాయిదా మీద వాయిదా వేస్తూ తిప్పిస్తున్నారు. హైకోర్టుకు వెళ్లినా నా బాధ వినేవారు లేరు. కొందరు చేస్తున్న కుట్రల వల్ల నా కేసును హైకోర్టులో లిస్టింగ్లోకి కూడా తీసుకోవట్లేదు". అని హసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలు చేసింది. షమీతో జహాన్ వివాహం 2014లో జరిగింది. 2015లో వీళ్లకు ఒక కూతురు జన్మించింది. 2018లో వరకట్నం వ్యవహారంలో వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరూ సెపరేట్గా ఉంటున్నారు.
ప్రస్తుతం షమీ ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2023 సీజన్ లో మొత్తం 28 వికెట్లతో టాప్ వికెట్ టేకర్ గా నిలిచి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఈ సీజన్ కు షమీ దూరం కావడంతో బౌలింగ్ లో గుజరాత్ జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. అతని స్థానంలో సందీప్ వారియర్ ను జట్టు ఎంపిక చేసింది.