బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా చివరి క్షణంలో ఏంజరిగిందంటే..

బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా చివరి క్షణంలో ఏంజరిగిందంటే..
  • ఆర్మీ అల్టిమేటంతో హసీనా రిజైన్
  • చివరి వరకూ ప్రధాని పీఠం వీడొద్దనుకున్న హసీనా
  • కుటుంబ సభ్యుల సలహాతో రాజీనామా.. ఆపై ఇండియాకు


ఢాకా: బంగ్లాదేశ్​లో శాంతి భద్రతలు నెలకొల్పాలని.. అధికారంలో కొనసాగాలని షేక్ హసీనా చివరి వరకు ప్రయత్నించినట్టు తెలుస్తున్నది. దేశంలో చెలరేగుతున్న హింసను అణిచివేసేందుకు ఆగస్టు 4న (ఆదివారం) జరిగిన ఉన్నత స్థాయి భద్రతాధికారులతో చర్చలలో కూడా శాంతి నెలకొల్పాలని, అల్లర్లను నియంత్రించాలని ఆమె ఆదేశించారు. 

అయితే అల్లర్లు తీవ్రమై పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో.. కుటుంబ సభ్యుల సూచనతో దేశం వీడినట్టు సమాచారం. అయితే హసీనా తన నివాసం నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల్లోనే పెద్ద గుంపు ఇంటిపై దాడి చేసి విధ్వంసం సృష్టించింది. ఆదివారం ఒక్కరోజే 90 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సైనిక అధికారులు నిరసనకారులతో చేతులు కలిపారని.. వారు ప్రభుత్వ ఆదేశాలు పాటించేందుకు సిద్ధంగా లేరని ఆదివారం సాయంత్ర చేసిన రివ్యూలో ఆమె దృష్టికి వచ్చింది. 

దేశంలోని పోలీసు చీఫ్‌‌లు కూడా చేతులెత్తేసినట్లు సమాచారం. అయినా కూడా ఆమె బెదరకుండా.. తన సందేశాన్ని ప్రకటించారు. నిరసనకారులను ‘‘ఉగ్రవాదులు’’గా పేర్కొన్నారు. వారిని ప్రతిఘటించాలని ప్రజలను కోరారు.

ఆజ్యం పోసిన సోషల్ మీడియా

దాడుల దృశ్యాలు, విద్యార్థులపై కాల్పులు, బుల్లెట్ గాయాల వీడియాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది విద్యార్థులు, ప్రజల్లో మరింత ఆగ్రహాన్ని పెంచింది. దీంతో స్టూడెంట్ లీడర్లు సోమవారం ‘లాంగ్ మార్చ్​ టు ఢాకా’ చేపట్టాలని  పిలుపునిచ్చారు.

ప్రధాని నివాసానికి భద్రత ఇవ్వలేమన్న ఆర్మీ చీఫ్​

ఆగస్టు 5న ఉదయం నుంచి పెద్ద ఎత్తున జనం ఢాకా వైపు వెళ్లడం ప్రారంభించారు. ఆర్మీ చీఫ్ జమాన్.. హసీనా నివాసానికి వెళ్లి ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘిస్తున్నారని.. హింస పెరుగుతోందని చెప్పారు. ప్రధాని నివాసం భధ్రతకు హామీ ఇవ్వలేమని.. త్వరగా దేశం వదిలి వెళ్లిపోవాలని అల్టిమేటం ఇచ్చారు. సోదరి రెహానా సిద్ధిక్ ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులు ఒప్పించడంతో హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. హెలికాప్టర్​లో విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి సైనిక విమానంలో అగర్తలలో దిగారు.

హసీనా మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తరు: వాజీద్​ జాయ్​

బంగ్లాదేశ్​లో తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినప్పుడు మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి దేశానికి వస్తారని ఆమె కొడుకు సజీబ్ వాజెద్ జాయ్ ​ తెలిపారు. శుక్రవారం ఆయన  యూఎస్‌‌ నుంచి మీడియాతో మాట్లాడుతూ “ప్రస్తుతం హసీనా ఇండియాలో ఉన్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన వెంటనే ఎన్నికల్లో పాల్గొనేందుకు ఆమె తిరిగి బంగ్లాదేశ్‌‌కు వెళ్తారు  అని అన్నారు.