- ఐదోసారి బాధ్యతలు చేపట్టిన అవామీ లీగ్ చీఫ్
- బంగ్లాదేశ్‌కు భారత్ గొప్ప మిత్రదేశమని హసీనా కామెంట్
- ఎన్నికలను బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షం బీఎన్పీ
ఢాకా: బంగ్లాదేశ్ ప్రజలను తాను ఓ తల్లిలా చూసుకుంటానని ఆ దేశ ప్రధాని షేక్‌హసీనా తెలిపారు. భారత్ తమకు గొప్ప మిత్ర దేశమని ఆమె స్పష్టం చేశారు. రెండు దేశాలు తమ మధ్య ఉన్న సమస్యలను ద్వైపాక్షికంగా పరిస్కరించుకున్నాయని, 1971, 1975లో ఇండియా తమకు సపోర్టు ఇచ్చిందని గుర్తు చేసుకున్నారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందిన అవామీ లీగ్ చీఫ్, దేశ ప్రధాని షేక్ హసీనా సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘దేశాన్ని నడుపుతున్నప్పుడు, మగవారా లేదా మహిళనా అనేది ఆలోచించకూడదు. నాకూ ఆంక్షలు ఉన్నా, ప్రజల కోసం పనిచేసేటప్పుడు నేను స్త్రీని అని ఎప్పుడూ భావించలేదు. ఒక తల్లి తన కుటుంబాన్ని చూసుకుంటూ పిల్లలను పెంచుతుందో.. నేను అలాగే మాతృవాత్సల్యంతో ప్రజలను కాపాడుకుంటాను. నేను సాధారణ వ్యక్తిని మాత్రమే. ప్రజలు మెరుగైన జీవితం పొందేలా చూసేందుకు ప్రధాని పదవిని ఒక అవకాశమని నేను భావిస్తాను” అని ఆమె పేర్కొన్నారు. కాగా, ఢాకాలోని భారత హైకమిషనర్ ప్రణయ్ కుమార్ వర్మ సోమవారం బంగ్లాదేశ్ ప్రధాని హసీనాను కలిసి, భారత దేశం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.
రికార్డు సృష్టించిన హసీనా
ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ మూడింట రెండొంతుల మెజారిటీ సాధించింది. వరుసగా నాలుగుసార్లు, మొత్తంగా ఐదుసార్లు ప్రధానిగా గెలిచి హసీనా ప్రపంచంలోనే అత్యధిక కాలం పనిచేసిన మహిళా దేశాధినేతగా అవతరించారు. మొత్తం 300 సీట్లకుగానూ 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి వరకూ కౌంటింగ్ కొనసాగింది. అవామీ లీగ్ పార్టీ 224 స్థానాల్లో పోటీ చేసి, 216 స్థానాలను గెలుచుకున్నది. మిగిలిన స్థానాల ఫలితాలు ఇంకా ప్రకటించలేదని దేశ ఎన్నికల సంఘం తెలిపింది.
డమ్మీ ఎన్నికలను రద్దు చేయాలి
మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్పీ) ఎన్నికలను బహిష్కరించింది. పార్టీయేతర కేర్ టేకర్ సర్కారు ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్‌కు హసీనా ఒప్పుకోలేదు. దీంతో బీఎన్పీ పోలింగ్‌ను బహిష్కరించింది. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది.