T20 World Cup 2024: చెలరేగిన ఆసీస్ బౌలర్.. వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్

T20 World Cup 2024: చెలరేగిన ఆసీస్ బౌలర్.. వరల్డ్ కప్‌లో తొలి హ్యాట్రిక్

వరల్డ్ కప్ లో బౌలర్ల జోరు కొనసాగుతుంది. సూపర్ 8 లో భాగంగా అస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం (జూన్ 21) ఉదయం బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్ లో కమ్మిన్స్ ఈ ఘనత సాధించాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కమ్మిన్స్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. తొలి నాలుగు బంతులకు 5 పరుగులే ఇచ్చిన ఈ ఆసీస్ పేసర్ చివరి రెండు బంతులకు వికెట్లను పడగొట్టాడు. ఐదో బంతికి మహమ్మదుల్లాను క్లీన్‌ బౌల్డ్‌ చేసిన కమిన్స్‌.. అదే ఓవర్‌ చివరి బాల్‌కు మెహదీ హసన్‌ను పెవిలియన్ కు పంపాడు. 

20వ ఓవర్లో బౌలింగ్ కొనసాగించిన కమ్మిన్స్.. స్లో బంతితో హృదయ్ ను బోల్తా కొట్టించాడు. దీంతో కమ్మిన్స్ హ్యాట్రిక్ పూర్తయింది. ఈ వరల్డ్ కప్ లో ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. ఆస్ట్రేలియా తరపున టీ20 వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ గా కమ్మిన్స్ నిలిచాడు. 2007 లో బంగ్లాదేశ్ పైనే బ్రెట్‌ లీ హ్యాట్రిక్‌ సాధించాడు. టీ20 వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే ఇది తొలి హ్యాట్రిక్. ఓవరాల్ గా ఏడో బౌలర్ గా కమిన్స్ చరిత్ర సృష్టించాడు. అంతకముందు బ్రెట్ లీ, కర్టిస్ క్యాంఫర్,వనిందు హసరంగా,కగిసో రబడ,కార్తీక్ మెయ్యప్పన్,జాషువా లిటిల్ ఈ లిస్ట్ లో ఉన్నారు.

ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్న కమ్మిన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే సూపర్ 8 లో భాగంగా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. 141 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 11.2 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. ఈ టైమ్‌లో వర్షం వచ్చి మ్యాచ్‌ ఆగిపోవడంతో.. డక్‌ వర్త్‌ లూయిస్‌ ప్రకారం అంపైర్లు ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు.