ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఆదిలాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మూడు మండలాలు ఏర్పాటు చేయండి

భైంసా, వెలుగు: ముథోల్ నియోజకవ ర్గంలో కొత్తగా మూడు మండలాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే రామారావు పటేల్​ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జీరో అవర్స్​లో ఎమ్మెల్యే మాట్లాడారు. బెల్​ తరోడా, పల్సి, మాలేగాంను మండలాలుగా ప్రకటించాలన్నారు. 30 మండలాలను ఏర్పాటు చేస్తున్నట్లు జారీ చేసిన జీవోలో ముథోల్​ నియోజకవర్గంలోని నూతన మండలాల పేర్లు లేవని, తక్షణమే జాబితాలో చేర్చి కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై సంబంధిత శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ఎమ్మెల్యే పటేల్​ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.

సింగరేణి సమస్యలు  అసెంబ్లీలో చర్చించాలి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల డిమాండ్లు, సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని సీఐటీయూ​ లీడర్లు డిమాండ్​ చేశారు. మంగళవారం మందమర్రి ఏరియా కేకే-5 గనిపై నిర్వహించిన కార్యక్రమంలో సీఐటీయూ ఏరియా ప్రెసిడెంట్​ఎస్.వెంకటస్వామి, సెక్రటరీ ఆల్లి రాజేందర్ మాట్లాడారు. కార్మికులు ఏండ్లుగా డిమాండ్​ చేస్తున్న సొంతింటి కల పథకం, పెర్క్స్​పై ఐటీ మాఫీ, మారుపేర్ల సవరణ, విజిలెన్స్​ పేరిట వారసులకు ఉద్యోగాల నిలిపివేత తదితర అంశాలను అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి పరిష్కార మార్గం చూపాలని డిమాండ్​ చేశారు. గెలిచిన కార్మిక సంఘాలు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా సంతకాల సేకరణ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. లీడర్లు భేతి భరత్, రాజ్ కుమార్, పిట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
 
బాసర ఆలయ దుకాణాలకు వేలం

బాసర, వెలుగు: నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పరిధిలో ఉన్న పలు వ్యాపార దుకాణాలకు మంగళవారం అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. పలువురు వ్యాపారులు వేలం పాడగా ఆలయానికి రూ.2.55 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో నవీన్​ కుమార్​ తెలిపారు. ఏడాది కాలం పాటు దుకాణాలను నిర్వహించుకోవచ్చన్నారు. ఇందులో ఏఈవో సుదర్శన్​గౌడ్, రవీందర్, వ్యాపారులు పాల్గొన్నారు.

పేదలకు ఉచితంగా న్యాయ సేవలు అందిస్తాం


జైపూర్, వెలుగు: పేద వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందిస్తామని సీనియర్ సివిల్ జడ్జి మారంరెడ్డి అర్పిత అన్నారు. మంగళవారం జైపూర్ మండలంలోని టేకుమట్లలోని రైతు వేదికలో ఇందారం క్లస్టర్ రైతులతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించగా జడ్జి అర్పిత హాజరై న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, పేద ప్రజలకు, 60 ఏండ్లు పైబడిన వారికి న్యాయ సేవలను ఉచితంగా అందిస్తా మని తెలిపారు. న్యాయ సలహాలు, సూచనలకు 15100 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. రైతులు ఎరువుల దుకాణాల్లో కొన్న ప్రతి వస్తువుకు రసీదు తీసుకోవాలన్నారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ మార్క్ గ్లాడ్ స్టన్, అడ్వకేట్ సంధాని పాల్గొన్నారు.

వరల్డ్ విజన్ సేవలు అభినందనీయం

లక్ష్మణచాంద, వెలుగు: వరల్డ్ విజన్ సేవలు అభినందనీయమని నిర్మల్ ​జిల్లా అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ అన్నారు. వరల్డ్ విజన్ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం లక్ష్మణచాంద మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదికలో నిర్వహించిన ఫుడ్ బాస్కెట్ కార్యక్రమానికి ఆయన హాజరై పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలతోపాటు గర్భిణులకు ఫుడ్ బాస్కెట్లు అందించారు. పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్న ఐదేండ్లలోపు పిల్లలకు వరల్డ్​విజన్​ సంస్థ గత 6 నెలలుగా అందిస్తుండడం అభినందనీయమన్నారు. మండల వ్యవసాయ అధికారి వసంత్ రావు, సీడీపీవో నాగమణి, తహసీల్దార్ జానకి, ఎంపీడీవో రాధా రాథోడ్, తదితరులు పాల్గొన్నారు.

పేకాడుతున్న నలుగురి అరెస్ట్

కాగజ్‌నగర్‌, వెలుగు: కాగజ్​నగర్​ పట్టణంలోని ఈఎస్ఐ ఓల్డ్ క్వార్టర్స్ లో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు టౌన్ ఎస్ఐ దీకొండ రమేశ్​ తెలిపారు. పక్కా సమాచారం మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి ఇ.చందు, ఆర్.సురేశ్, ఎం.శ్రీనివాస్, జి.నరేశ్​ను పట్టుకున్నామని, వారి వద్ద నుంచి రూ.4,700 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెప్పారు.