కవ్వాల్‌లో పర్యటించిన పీసీసీఎఫ్
జన్నారం రూరల్, వెలుగు: ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) డాక్టర్ సి.సువర్ణ డీఎఫ్‌వో శివ్ ఆశిశ్ సింగ్‌తో కలిసి గురువారం కవ్వాల్ ఫారెస్ట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కలప అక్రమ రవాణాను అరికట్టాలని, ఈ విషయంలో అధికారులు, సిబ్బంది సీరియస్‌గా వ్యవహరించాలని సూచించారు. ప్రజల్లో అడవుల రక్షణతో పాటు పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడానికి నూతన ప్రణాళికలురూపొందించాలన్నారు. జన్నారం, ఇందన్పల్లి ఎఫ్ఆర్వోలు సుష్మారావు, కారం శ్రీనివాస్ పాల్గొన్నారు.
వృద్ధురాలికి రూ.5 లక్షల ఎల్వోసీ
కోటపల్లి, వెలుగు: కోటపల్లి మండలంలోని దేవులవాడకు చెందిన కస్తూరి అంకక్క అనే పేద వృద్ధురాలు రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి చికిత్స చేయించుకునే స్తోమత లేక బాధపడుతోంది. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇటీవల గ్రామంలో పర్యటించగా.. అంకక్క పరిస్థితి గురించి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో ఎమ్మెల్యే స్పందించి హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకునేందుకు రూ.5 లక్షల ఎల్ వోసీ మంజూరు చేశారు. ఎల్వోసీ పత్రాన్ని స్థానిక కాంగ్రెస్నాయకులు గురువారం వృద్ధురాలికి అందజేశారు. సమస్య విన్నవించిన వెంటనే స్పందించి ఎల్ఓసీ అందజేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ కుటుంబానికి రూ.1.25 లక్షల సాయం
కోల్‌బెల్ట్, వెలుగు: కాగజ్‌నగర్ సీసీఎస్‌లో పనిచేస్తూ ఈనెల 16న గుండెపోటుతో మృతిచెందిన కానిస్టేబుల్ పెండం తిరుపతయ్య కుటుంబానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 1993 బ్యాచ్పోలీసులు సేకరించిన విరాళాన్ని గురువారం అందించారు. మృతుడు తిరుపతయ్య భార్య లక్ష్మి, కుటుంబసభ్యులకు రూ.1.25లక్షలను తోటి పోలీసులు అందించారు. తిరుపతయ్య గతంలో మంచిర్యాల, నస్పూర్, కాగజ్‌నగర్ తదితర పీస్‌లలో విధులు నిర్వహించారు.
పెద్దనపల్లిలో కార్డెన్ సెర్చ్
కాసిపేట, వెలుగు: మండలంలోని పెద్దనపల్లిలో మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు గురువారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. కాసిపేట, మందమర్రి, రామకృష్ణాపూర్, దేవాపూర్ ఎస్సైలు, నార్కోటిక్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు ఉంటున్నారా, అపరిచిత వ్యక్తులకు ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డులను పరిశీలించారు. సరైన డాక్యుమెంట్లు, నంబర్ ప్లేట్లు లేని 27 బైక్, 3 ఆటోలను గుర్తించి ఫైన్ వేశారు. నంబర్ ప్లేట్ లేని మూడు బైక్‌లను సీజ్ చేశారు.
రైలు కింద పడి యువకుడి సూసైడ్
బెల్లంపల్లి, వెలుగు: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెల్లంపల్లిలో జరిగింది. బెల్లంపల్లి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ రావు వివరాల ప్రకారం.. పట్టణంలోని అంబేద్కర్ రడగంబాల బస్తీకి చెందిన కాదాసి సిద్దార్థ(18) పట్టణంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తున్నాడు. ఓ యువతి తనను ప్రేమించి మోసం చేసిందని కొంతకాలంగా అతడు బాధపడుతున్నాడు. ఇదే విషయమై గతంలో చేతిపై కత్తితో గాయపర్చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
భైంసా, వెలుగు: భైంసా మండలం వానల్ పాడ్ గ్రామ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుంటాల మండలం విట్టాపూర్ గ్రామానికి చెందిన ఇంద్రాసేనారెడ్డి(38) పని కోసం భైంసా పట్టణానికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వానల్ పాడ్ బస్టాండ్ వద్ద ఓ ట్రాక్టర్‌ను ఢీ కొన్నాడు. బలమైన గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులకు ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం డెడ్‌బాడీకి కుటుంబసభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై మాలిక్ తెలిపారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
తాండూరు, వెలుగు: రేపల్లెవాడ సమీపంలో రెబ్బెన మండలం నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను మైనింగ్ ఏడీ జగనమోహన్ రెడ్డి బుధవారం రాత్రి పట్టుకున్నారు. ట్రాక్టర్లను తాండూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.