‘ఆరోగ్య మహిళ’ ద్వారా 45 రకాల టెస్ట్‌లు : కలెక్టర్ పమేలా సత్పతి
తిమ్మాపూర్, వెలుగు: ఆరోగ్య మహిళ కార్యక్రమంతో గ్రామాల్లోని మహిళలందరికీ వైద్యం అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి వైద్యాధికారులకు సూచించారు. తిమ్మాపూర్ మండలం ముక్తపల్లి జీపీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఆరోగ్య మహిళా క్యాంపును గురువారం ఆమె సందర్శించారు. క్యాంపు నిర్వహణ ఏర్పాట్లు పరిశీలించి, రిజిస్టర్ తనిఖీ చేశారు.
అనంతరం మాట్లాడుతూ 45 రకాల వైద్య పరీక్షలను మహిళలకు ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రతి మహిళ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆ తర్వాత గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఆమె వెంట డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఎంపీడీవో విజయ్ కుమార్, కో ఆర్డినేటర్ సనా ఉన్నారు.
పాఠాలు చెప్పిన కలెక్టర్
పనుల్లో నిత్యం బిజీగా ఉండే కలెక్టర్ పమేలా సత్పతి కాసేపు పంతులమ్మలా మారారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె మండలంలోని నల్లగొండ జడ్పీ హైస్కూల్‌లో ఆరో తరగతి విద్యార్థులకు మ్యాథ్స్ సబ్జెక్ట్ బోధించారు. పిల్లలను పలు ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టారు.
పట్టుదలతో చదివితే సక్సెస్ సొంతం
కరీంనగర్ టౌన్, వెలుగు: క్రమశిక్షణతో పట్టుదలగా చదివితే విజయం మన సొంతమవుతుందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. గురువారం స్థానిక ఉజ్వలపార్కు సమీపంలో వెంకట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలగోకులం ఆశ్రమాన్ని కలెక్టర్ పమేలాసత్పతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు ద్వారా ఏదైనా సాధించవచ్చన్నారు.
బాల గోకులంలోని సీనియర్ విద్యార్థులు, జూనియర్లకు ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ గంప వెంకట్, నిర్వాహకులు ఎ.సతీశ్, బల్మూరి కరుణాకర్‌రావు, కె.రామ్మోహన్ రావు, కె.రాజేశ్వరి, ప్రతాప్ పాల్గొన్నారు.