సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మం, వెలుగు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణ కుమారి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లో 89 మంది లబ్ధిదారులకు రూ. 29,32,500 విలువ చేసే చెక్కులను అందజేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బైరు హరినాథ్ బాబు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకట్ రెడ్డి, తిరుమలాయపాలెం మాజీ ఎంపీపీ మంగీలాల్ పాల్గొన్నారు.
హోంగార్డుపై చీటింగ్ కేసు
మణుగూరు, వెలుగు: మణుగూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించిన కట్కోజుల శ్రీనివాసాచారి పై చీటింగ్ కేసు నమోదైంది. సీఐ సతీశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితబంధు పథకం ద్వారా సమితి సింగారం గ్రామానికి చెందిన మద్దూరి నవీన్ కుమార్ అనే వ్యక్తికి రూ.10 లక్షలు ఇప్పిస్తానంటూ అతడి వద్ద రూ.80 వేలు తీసుకున్నాడు. కానీ దళితబంధు ఇప్పించకపోవడంతో పలుమార్లు అడిగిన బాధితుడిని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై బాధితుడు నవీన్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు హోంగార్డు శ్రీనివాసాచారి పై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ తెలిపారు.
లగచర్ల రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
అశ్వారావుపేట/కామేపల్లి/అన్నపురెడ్డిపల్లి, వెలుగు : లగచర్ల రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని బీఆర్ఎస్ నేతలు మంగళవారం పలుచోట్ల నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సూర్యప్రకాశ్‌రావు, కామేపల్లిలో జిల్లా నేతలు అంతోని అచ్చయ్య, మల్లెంపాటి శ్రీనివాసరావు, మూడు కృష్ణ ప్రసాద్, అన్నపురెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయుకలు బోయినపల్లి సుధాకర్‌రావు, భారత రాంబాబు మాట్లాడారు. లగచర్లలో భూములు ఇవ్వబోమని రైతులు అంటుంటే, వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నకు బేడీలు వేసి తీసుకువెళ్లటం బాధాకరమన్నారు.
టీచర్లు కావాలని స్టూడెంట్స్ ఆందోళన
కూసుమంచి, వెలుగు : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గట్టుసింగారంలోని కేజీబీవీ విద్యార్థినులు ‘మా టీచర్స్ మాకు కావాలి’ అంటూ స్కూల్ ఆవరణలో మంగళవారం ఆందోళన చేపట్టారు. సమగ్ర శిక్షణ ఉద్యోగుల సమస్యలపరిష్కారం కోసం వారం రోజుల నుంచి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట టీచర్లు, ఇతర సిబ్బంది ధర్నా చేస్తుండగా పిల్లలకు చదువులు కొనసాగడం లేదు. దీంతో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు.