నాగపురి రోజాకు సావిత్రిబాయి పూలే రాష్ట్ర స్థాయి అవార్డు
ఖమ్మం, వెలుగు: హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన సావిత్రిబాయి పూలే 194వ జయంతిలో ఖమ్మంలోని ఖానాపురం హవేలి వాసి నాగపురి రోజా రాష్ట్రస్థాయి అవార్డును అందుకున్నారు. మంత్రి సీతక్క, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిలుగా హాజరైన ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అవార్డును నాగపురి రోజాకు అందజేశారు. రైల్వే కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న నాగపూరి రోజా ఉత్తమ బోధనకు, సమాజ సేవకుగాను అవార్డును అందుకున్నారు.
కేసీఆర్ ను కలిసిన ఎంపీ వద్దిరాజు
ఖమ్మం, వెలుగు: రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను శుక్రవారం ఎర్రవెల్లిలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవితను రవిచంద్ర వేర్వేరుగా కలిసి విషెస్ చెప్పారు.
పేకాట స్థావరాలపై దాడులు
కారేపల్లి, వెలుగు: మండలంలోని మంగళ్ తండా చెరువు సమీపంలో పేకాట స్థావరంపై కారేపల్లి పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఎస్సై రాజారామ్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ్ తండా కు చెందిన కొందరు చెరువు సమీపంలో పేకాట ఆడుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పిల్లలమర్రి వెంకటేశ్, ధరావత్ చంటి, ధరావత్ గాంధీ, వాంకుడోత్ వీరన్న ను అదుపులోకి తీసుకున్నారు. బాలకృష్ణ, బాబురావు అనే వ్యక్తులు పరారయ్యారు. పేకాట స్థావరం వద్ద ఉన్న నాలుగు బైక్‌లు, సెల్ ఫోన్స్, కొంత నగదు స్వాధీనం చేసుకొని ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఖమ్మం టౌన్ : ఖమ్మం నగరంలోని కైకొండాయి గూడెంలో ఖానాపురం హావేలి, టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేశారు. పేకాట ఆడుతున్న పి.సారయ్య, అంకర్ల వీరబాబు, తోట రమణయ్య పట్టుబడగా, కోడిరెక్కల సీతారాములు, కట్టా నరేశ్, శీలం శివ పారిపోయారు. పట్టుబడినవారి నుంచి రూ.1,959 నగదు, రెండు బైక్ లు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ భాను ప్రకాశ్ తెలిపారు.
హత్య కేసులో వ్యక్తి కి జైలు శిక్ష
చుంచుపల్లి, వెలుగు : హత్య కేసులో వ్యక్తికి జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు ఇచ్చారు. 2022 ఫిబ్రవరి 7 న షేకు యాకూబ్ పాషా తన తల్లి షేక్ ఫాతిమా తో గొడవపడి ముఖం మీద కొట్టాడు. తన మేనమామ షేక్ లతీఫ్, ఆయన కూతురు రజియా వచ్చి ఎందుకు కొడుతున్నావని అడగగా లతీఫ్ ను పెద్ద బండరాయితో ఛాతి మీద కొట్టాడు.
కొత్తగూడెం హాస్పిటల్ లో చికిత్స పొందుతూ లతీఫ్ చనిపోయాడు. భార్య బీజాన్ బి సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై ఎం. శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అనంతరం సీఐ రమాకాంత్ కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. కోర్టులో సాక్షులను విచారించిన అనంతరం యాకూబ్‌కు మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.