మర్డర్ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు
పెనుబల్లి, వెలుగు : మర్డర్ కేసులో అరుగురికి జీవిత ఖైదు విధిస్తూ సత్తుపల్లి కోర్ట్ లో జడ్జ్ సంచలన తీర్పు ఇచ్చారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బ్రహ్మళ్లకుంట గ్రామానికి చెందిన ఎటుకూరి నరసింహారావు అనే వ్యక్తిని 2019 లో అదే గ్రామానికి చెందిన కొంతమంది పాత కక్షలతో హత్య చేశారు. ఈ కేసులో బ్రాహ్మళ్లకుంట గ్రామానికి చెందిన బానోత్ గోపి, బానోత్ వెంకటేశ్వరావు, బానోత్ భీమా, బానోత్ మోహన్, అజ్మీరా రవీంద్ర, బానోత్ కృష్ణ, వంకుడోత్ మంగమ్మను విఎం బంజరు పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా, సత్తుపల్లి ఆరవ అదనపు జడ్జ్ ఎం.శ్రీనివాస్ బుధవారం తీర్పు ఇచ్చారు.
మొదటి ఇద్దరి ముద్దాయిలకు జీవిత ఖైదుతోపాటు రూ.10 వేలు జరిమానా, ఆ తర్వాత ఉన్న నలుగురు ముద్దాయిలకు జీవిత ఖైదుతో పాటు రూ.5 వేల జరిమానా, ఏడవ ముద్దాయికి 5 సంవత్సరాల జైలు శిక్ష రూ.5 వేల జరిమానా విధించినట్లు విఎం బంజరు పోలీసులు తెలిపారు.
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
భద్రాచలం, వెలుగు : ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దుమ్ముగూడెం మండలం డబ్ల్యూఎల్ రేగుబల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బర్ల గౌతమి భర్త, ఇద్దరి పిల్లలతో నివాసం ఉంటుంది. బుధవారం భర్త వినోద్ ఊళ్లో లేని సమయంలో ఆమె గడ్డి మందు తాగి, అనంతరం తన ఇద్దరు పిల్లలకు కూడా తాగించింది. స్థానికులు చూసి వారిని భద్రాచలం తరలించారు. వారి ఆత్మహత్యాయత్నానికి కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది.
10 మందిపై కేసు
ముదిగొండ, వెలుగు : ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పలుమార్లు హెచ్చరించిన వారు తీరు మార్చుకోకపోవడంతో 10 మందిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ముదిగొండ ఎస్ హెచ్ వో సీఐ వడ్డేపల్లి మురళి తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై నరేశ్ బుధవారం తన సిబ్బందితో మండల పరిధిలో సువర్ణాపురం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తుండగా గంధసిరి గ్రామం నుంచి ఏడు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా వారిని పట్టుకొని ట్రాక్టరులను స్వాధీనం చేసుకొని స్టేషనుకు తరలించారు.
ట్రాక్టరు డ్రైవర్లు అయిన షేక్ యాకుబ్, షేక్ చాంద్ పాషా, షేక్ అబ్దుల్ కరీం, షేక్ చిన్న బాబా, షేక్ మదార్ సాహెబ్, పెనుగొండ గోపి, మర్రి అరుణ్ కుమార్, ట్రాక్టరు ఓనర్లు షేక్ యాకుబ్ అలీ, షేక్ చాంద్ బీ, వి. శ్రీనివాస రెడ్డిపై కేసు నమోదు చేశారు.
చలో అసెంబ్లీ సక్సెస్ చేయాలి
కూసుమంచి, వెలుగు : ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, మాల మహానాడు ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మాల మహానాడు జిల్లా నాయకుడు, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్ పిలుపునిచ్చారు.
తిరుమలాయపాలెం మండల కేంద్రంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పై ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ 19న చేపట్టే చలో అసెంబ్లీ ముట్టడికి తిరుమలాయపాలెం నుంచి మాల మహానాడు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లనున్నట్లు తెలిపారు.