ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
అన్నపురెడ్డిపల్లి, వెలుగు : మండలంలోని పలు ఎరువుల దుకాణాలను భద్రాద్రికొత్తగూడెం డీఏవో బాబురావు శుక్రవారం తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను, బిల్ బుక్స్ ను పరిశీలించారు. ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు రైతులు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. అశ్వారావుపేట ఏడీఏ రవికుమార్, ఏవో అనూష ఉన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
పాల్వంచ, వెలుగు : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సింగరేణి కాలరీస్ జనరల్ మేనేజర్ కొండా శ్రీనివాస్ అన్నారు. పాల్వంచలోని కేటీపీ ఎస్ టీఆర్సీ ఇండోర్ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన సీఎం కప్ జిల్లా స్థాయి షెటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు ఆయన శుక్రవారం బహుమతులు అందజేశారు. మార్క్ఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు, జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి, కార్యదర్శి నరేశ్, ఒలంపిక్ అసోసియేష న్ జిల్లా సెక్రటరీ రాజేంద్రప్రసాద్, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇంటూరి రవికుమార్, కార్యదర్శి డాక్టర్ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
ఆర్ఎంపీలు పరిమితికి మించి వైద్యం చేయొద్దు
జూలూరుపాడు, వెలుగు : ఆర్ఎంపీలు తమ పరిమితికి మించి వైద్యం చేయొద్దని కొత్తగూడెం డీఎంహెచ్వో భాస్కర్ నాయక్ సూచించారు. శుక్రవారం మండలంలోని అనంతారం గ్రామాన్ని ఆయన సందర్శించారు. కిడ్ని పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మధు వరుణ్ తదితరులు పాల్గొన్నారు.
అమిత్షా క్షమాపణ చెప్పాలి
భద్రాచలం/బూర్గంపహాడ్/చండ్రుగొండ,వెలుగు : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తక్షణమే దేశానికి క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని పలువురు నాయకులు డిమాండ్ చేశారు. అమిత్ షా దిష్టిబొమ్మలు దహనం చేశారు. భద్రాచలంలో సీపీఎం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, బూర్గంపహాడ్ లో టీపీసీసీ సభ్యుడు తాళ్లూరి చక్రవర్తి, చండ్రుగొండ లో మాలమహానాడు మండల అధ్యక్షుడు బడుగు శంకర్ మాట్లాడుతూ రాజ్యాంగం స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకురావాలని బీజేపీ సర్కారు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రియల్ వ్యాపారుల దిద్దుబాటు చర్యలు
కామేపల్లి, వెలుగు : మండల పరిధిలోని కొండాయిగూడెంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందు శుక్రవారం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. శుక్రవారం ‘ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘించి రియల్ వ్యాపారులు’ కథనం వెలుగు దినపత్రికలో రావడంతో వారు చేసిన ప్లాట్లను చెరిపేసి వ్యవసాయ భూమిగా ట్రాక్టర్ తో దున్నించారు. చాకరాయి కుంట చెరువులో పోసిన కొబ్బరి చెట్ల వ్యర్థాలను కూడా కాల్చివేశారు. దీనిపై ఎల్ హెచ్ పీఎస్ ఇల్లెందు నియోజకవర్గ అధ్యక్షుడు బాదావత్ నరేశ్ నాయక్ స్పందిస్తూ కలెక్టర్, ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు
సత్తుపల్లి, వెలుగు : గడువుదాటిన కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీతో కాంగ్రెస్ ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడుతోందని మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్ విమర్శించారు. పట్టణానికి చెందిన 13 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు గురువారం అందజేసిన చెక్కులు 3 నెలల గడువుకు ఆఖరి రోజున అందజేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యంతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దన్నారు.
పేకాట స్థావరంపై దాడి
భద్రాచలం, వెలుగు: భద్రాచలం పట్టణ శివారులోని జామాయిల్ తోటలో శుక్రవారం పేకాట స్థావరంపై కొత్తగూడెం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. 8 మందిని పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు. రూ.52వేల క్యాష్, 3 బైక్లు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లను భద్రాచలం టౌన్ స్టేషన్కు అప్పగించారు.
వైరా: వైరా మున్సిపాలిటీ లోని గాంధీ నగర్ లో పేకాట ఆడుతున్న 12 మంది పేకాటరాయుళ్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 85,500 నగదు, మూడు కార్లు, ఒక బైకు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.