మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..  

మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే..  

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి

మెదక్​, వెలుగు : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మెదక్​ మున్సిపాలిటీ పరిధి ఔరంగాబాద్ నుంచి ముగ్గురు యువకులు గురువారం బైక్​మీద రామాయంపేట వైపు వెళ్తుండగా మెదక్ మండలం పాతూరు గ్రామ శివారులో కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి దగ్గర మలుపులో అజాగ్రత్తగా నడుపుతూ రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో  రాయలపురం నవీన్ (21) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పండ్ల రమేశ్, గుడాల గణేశ్​కు గాయాలు కాగా మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఎక్సెల్​పై నుంచి పడి ఒకరు..

తూప్రాన్ : ఎక్సెల్​వాహనం నుంచి కిందపడి ఒకరు మృతి చెందిన ఘటన తూప్రాన్ లో జరిగింది. ఎస్ఐ శివానందం కథనం ప్రకారం..మాసాయిపేట మండలం నడిమితండాకు చెందిన మాలోత్ మంజ్యా  (70)  గురువారం ఎక్సెల్ మీద తూప్రాన్​వెళ్తుండగా కుక్క అడ్డుగా రావడంతో కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మంజ్యా చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

పతంగి కోసం వెళ్లి బాలుడు..

సిద్దిపేట రూరల్ : పతంగి కోసం వెళ్లిన ఓ బాలుడు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన సిద్దిపేట వన్ టౌన్ పీఎస్​పరిధిలోని మత్సవాని కుంటలో జరిగింది. సీఐ వాసుదేవరావు కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం లెక్చరర్స్ కాలనీకి చెందిన అల్లెపు లింగం, పద్మల కుమారుడు తేజ్ కుమార్(11) ఈ నెల 24న ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కోసం వెతికినా దొరకలేదు. దీంతో పీఎస్​లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు కాలనీ పరిసర ప్రాంతాల్లో వెతుకుతుండగా గురువారం మధ్యాహ్నం మత్సవానికుంటలో అనుమానాస్పదంగా ఓ పతంగి కనిపించింది. ఆ ప్రదేశంలో గజ ఈతగాళ్ల సాయంతో వెతికించగా బాలుడి డెడ్​బాడీ దొరికింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఎస్ఐ మృతితో కొల్చారంలో విషాదం

కొల్చారం, వెలుగు : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ ఎస్ఐగా పనిచేస్తున్న సాతెల్లి సాయి కుమార్ మృతితో ఆయన స్వగ్రామమైన కొల్చారంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన సాయి కుమార్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న లక్ష్మీనారాయణను ఆదర్శంగా తీసుకుని ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. గ్రామంలో అందరితో కలుపుగొలుగా ఉండడంతో పాటు, సంఘ మిత్ర యువజన సంఘం తరపున చేపట్టే సోషల్ సర్వీస్, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించేవాడు. గురువారం సాయంత్రం జరిగిన అంత్యక్రియల్లో గ్రామస్తులు, స్నేహితులు, అతడి బ్యాచ్ కు చెందిన ఎస్ఐలు పాల్గొన్నారు. బిక్క నూర్ పీఎస్​సిబ్బంది సాయి కుమార్ కు నివాళులర్పించారు. 

అయ్యప్ప స్వామికి లక్ష పుష్పార్చన

సంగారెడ్డి టౌన్, వెలుగు :  సంగారెడ్డి పట్టణం బైపాస్ రహదారిలోని శ్రీధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో లక్ష పుష్పార్చన కార్యక్రమం గురువారం నిర్వహించారు. మహిళలు, భక్తులు పుష్పాలను పూజించి స్వామివారికి సమర్పించారు. రామచంద్ర గౌడ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. రాత్రి గంగాధర్ శర్మ పర్యవేక్షణలో మహా పడిపూజ కార్యక్రమాన్ని జరిపించారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు శ్రీశైలం, కోశాధికారి ప్రేమ్ సాగర్,  ఉపాధ్యక్షుడు శేషగిరి, జనప్రియ రాజు,  సంయుక్త కార్యదర్శి గోపాల్, గురుస్వాములు వెంకన్న, విష్ణువర్ధన్ రెడ్డి, తిరుపతిరెడ్డి, రవీందర్, రవి పాల్గొన్నారు.

ఆటోడ్రైవర్​ కుటుంబానికి ఆర్థిక సాయం

ములుగు, వెలుగు : ములుగుకు చెందిన దోర్నాల శ్రీకాంత్ (33), బుధవారం రాత్రి ప్రజ్ఞాపూర్ గ్రామ శివారులో ఆటో ప్రమాదంలో గాయపడ్డాడు. చికిత్స కోసం లక్ష్మక్కపల్లి ఆర్ వీఎం హాస్పిటల్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీకాంత్​కుటుంబాన్ని గురువారం ఆటో మైసమ్మ యూనియన్ డ్రైవర్లు పరామర్శించి రూ.40 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా యూనియన్​ నాయకులు మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు చెందిన ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ స్వామి, నర్సింలు, సురేశ్, యూసుఫ్, బాబు, లక్ష్మణ్, కర్ణాకర్, ఆంజనేయులు, అంజి పాల్గొన్నారు.