20న దివ్యాంగులకు ప్రత్యేక హెల్త్ క్యాంప్
మెదక్, వెలుగు: దివ్యాంగుల కోసం ఈ నెల 20న మెదక్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసినట్టు బుధవారం కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. డీఆర్డీవో, డీడబ్ల్యూవో, వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమన్వయంతో ఈ హెల్త్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. డాక్టర్ ఈశ్వర్ దాస్ (జనరల్ సర్జన్), సురేందర్ (ఆర్థోపెడిక్,) పావని (స్త్రీ వైద్యనిపుణులు), డి.కిరణ్ (ఈ ఎన్ టీ), డాక్టర్ రాజేశ్ (ఆప్తమాలజిస్ట్,), డాక్టర్ గ్రేస్ (ఫిజియోథెరపిస్ట్), డాక్టర్ ప్రదీప్ (మానసిక వైద్య నిపుణులు), మాధవి (డెంటల్ సర్జన్,) డాక్టర్ కరుణాకర్ (ఫిజియోథెరపిస్ట్, ఊపిరితిత్తులు, శ్వాసకోస వ్యాధి నిపుణులు) దివ్యాంగులను పరీక్షించి అవసరమైన వైద్య సేవలు అందిస్తారని వెల్లడించారు.
కొనసాగుతున్న క్రీడా పోటీలు
సంగారెడ్డి టౌన్, వెలుగు: వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లక్ష్యసాధన కోసం నిరంతరం కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలోని బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో క్రీడా పోటీలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ స్థాయిలో ప్రతిభ ఉన్న క్రీడాకారులను వెలికితీయడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావెద్అలీ, కాసిం బేగ్, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ పాల్గొన్నారు.
జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా అస్మ షరిన్
జోగిపేట, వెలుగు: సంగారెడ్డి జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ గా జోగిపేటకు చెందిన అస్మా షరిన్ను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్వర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆమె మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.
బైక్ ప్రమాదంలో మహిళ మృతి
కొల్చారం, వెలుగు: బైక్ అదుపు తప్పి కింద పడి ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన కొల్చారం మండల పరిధిలోని లోతువాగు వద్ద జరిగింది. ఎస్ఐ మహ్మద్గౌస్కథనం ప్రకారం..కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం రేపల్లెవాడకు చెందిన పిట్ల స్వప్న, భర్త దుబాయ్‌లో పని చేస్తుండగా ఆమె తన పిల్లల చదువు కోసం హైదరాబాద్‌లో ఉంటోంది.
బుధవారం తన అక్క గ్రామమైన దల్మల్కపల్లికి తన బావ, తమ్ముడు శ్రీనివాస్ తో కలిసి బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపు తప్పి కింద పడడంతో స్పాట్లోనే మృతిచెందింది. ఆమె మామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
ఉరేసుకొని ఒకరు సూసైడ్
పాపన్నపేట, వెలుగు: మతిస్థిమితం సరిగా లేక ఉరేసుకొని ఒకరు చనిపోయారు. ఈ ఘటన మండలంలోని ఏడుపాయల సమీపంలో మంజీరా నది ఒడ్డున జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం..సంగారెడ్డి జిల్లా బిలాల్ పూర్ కు చెందిన బలుపాటి ఆనంద్ (33) కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నాడు. బుధవారం ఏడుపాయల ఆలయ సమీపంలోని మంజీరా నది ఒడ్డున ఓ చెట్టుకు ఉరేసుకొని ఉండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని మెదక్‌జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి అన్న శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మరొకరు..
సిద్దిపేట రూరల్: సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినట్లు సీఐ ఉపేందర్ తెలిపారు. రెండు జుల కింద పట్టణంలోని కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ ల వద్ద గుర్తు తెలియని వ్యక్తి పడిపోయి ఉన్నాడన్న సమాచారం వచ్చిందన్నారు.
వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి వివరాలు అడగగా తన పేరు వెంకటేశం, తండ్రి పేరు వీరయ్య, గ్రామం సంగారెడ్డి అని చెప్పాడన్నారు. మృతుడిని ఎవరైనా గుర్తు పడితే టూ టౌన్ పీఎస్‌కు సమాచారం అందించాలని సీఐ కోరారు