సంబురంగా డిగ్రీ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు
సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లో 1974లో డిగ్రీ పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగినట్లు స్వర్ణోత్సవ సంబరాల వేదిక కమిటీ సభ్యులు హరిచంద్ర, అమ్మన చంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, గణేశ్ తెలిపారు. శుక్రవారం కాలేజ్ ప్రిన్సిపాల్ డా. జి. సునీత అధ్యక్షతన సభా సమావేశం జరగ్గా, కాలేజీ ఆడిటోరియంలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ.. తాము చదువుకున్న కాలేజ్ గురించి స్మరించుకుంటూ, తమకు విద్యాబోధన చేసిన గురువులను సన్మానించుకున్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం
మల్యాల, వెలుగు: మల్యాల మండల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద అంబేడ్కర్ విగ్రహానికి శుక్రవారం అంబేడ్కర్ సంఘం నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఇటీవల పార్లమెంటు సమావేశంలో కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానించడంపై నిరసిస్తూ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముప్పారపు రవీందర్, శనిగారపు తిరుపతి, ఈశ్వర్ పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు నెరవేర్చాలి
సిద్దిపేట రూరల్, వెలుగు: సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవెల్లి రఘునాథ్ తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. 11 రోజుల నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
సిద్దిపేట టౌన్, వెలుగు: ఆశా వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. ఆశా కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్ జాతా సిద్దిపేట జిల్లాకు వచ్చిన సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా పాత బస్టాండ్ నుంచి ప్రెస్ క్లబ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి
మనోహరాబాద్, వెలుగు: డీసీఎం ఢీ కొట్టడంతో దండుపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం ఓ వ్యక్తి చనిపోయాడు. ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా సూతారిగూడ గ్రామానికి చెందిన మల్లేశ్ (75) పని నిమిత్తం తన టీవీఎస్ ఎక్సెల్ పై తూప్రాన్ వెళ్లి తిరిగి వస్తుండగా దండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుంచి వస్తున్న డీసీఎం అతివేగంగా ఢీకొట్టడంతో మల్లేష్ కు తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు మేడ్చల్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించగా కొద్దిసేపటి తర్వాత మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
కేజీబీవీ స్కూల్ సందర్శించిన ఆర్డీవో
మనోహరాబాద్, వెలుగు: కుచారంలో ఉన్న కేజీబీవీ స్కూల్‌ను తూప్రాన్ ఆర్డీవో జయచంద్రరెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనీఖి చేశారు. విద్యార్థులకు పెడుతున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థులకు సరైన భోజనం అందించాలని సూచించారు.
25న ఉపరాష్ట్రతి రాక
మెదక్, వెలుగు: ఉప రాష్ట్రపతి జగదీష్ ధన్ ఖడ్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈనెల 25వ తేదీన తునికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించనున్నారు. అక్కడ అగ్రి సైంటిస్ట్ లు పర్యవేక్షణలో సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేస్తున్న పంటలు, జీవ ఎరువుల తయారీ, సేంద్రీయ ఉత్పత్తుల ఎగ్జిబిషన్ ను పరిశీలిస్తారు. సేంద్రీయ సాగు చేస్తున్న రైతులతో ముఖాముఖి లో పాల్గొంటారు.