మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్..

మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్..

దుర్గమ్మ సన్నిధిలో  హెల్త్ ​మినిస్టర్

పాపన్నపేట, వెలుగు: ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని ఆదివారం మంత్రి  దామోదర రాజనర్సింహ సందర్శించారు. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం ఆలయ సిబ్బంది శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్​చార్జి రాజిరెడ్డి, సుప్రభాత రావు, మల్లేశ్ గౌడ్ పాల్గొన్నారు.

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

మెదక్, వెలుగు: న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మెదక్ పట్టణ పరిధిలోని  పిల్లి కొటాల్ లో ఆదివారం జరిగింది. బాధితురాలు నాచారం శ్వేత తెలిపిన ప్రకారం.. పిల్లి కొటాల్ కు చెందిన నాచారం శ్వేత అదే ఏరియాకు చెందిన మల్లుపల్లి రవి అలియాస్ మహేశ్​మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్వేతను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రవి ప్రస్తుతం ఇష్టం లేదని చెబుతున్నాడు. దీంతో ఆమె రవి ఇంటి ముందు బైఠాయించి ఆందోళన చేపట్టింది. విషయం తెలిసి మెదక్ పట్టణ పోలీసులు అక్కడికి వచ్చి శ్వేత నుంచి ఫిర్యాదు తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

డీసీఎం బైక్​ఢీ: ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు

ములుగు, వెలుగు: డీసీఎం బైక్​ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మలుగు మండలం కొత్తూరు గ్రామంలో జరిగింది. ఎస్ఐ విజయ్​కుమార్​కథనం ప్రకారం.. బీహార్ లోని మదపూర్ జిల్లాకు చెందిన దిల్బర్ కుమార్ సింగ్ (29), శిపు చందు నూజివీడు సీడ్స్ కంపెనీలో హమాలీగా పనిచేస్తున్నారు. ఆదివారం రాత్రి కొత్తూరు నుంచి నూజివీడు కంపెనీకి బైక్​పై వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో దిల్బర్ కుమార్ సింగ్ అక్కడికక్కడే చనిపోగా శిపు చెందుకి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని మేడ్చల్ లోని ఓ ప్రైవేట్​ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దిల్బర్ కుమార్ సింగ్ బాడీని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.