మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మెదక్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

మేక పిల్లలపై కుక్కల దాడి

పటాన్​చెరు(గుమ్మడిదల),వెలుగు: వీధి కుక్కల దాడిలో మేక పిల్లలు మృతి చెందిన ఘటన గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డి పల్లిలో శనివారం జరిగింది. బాధితుడు మహిపాల్​ కథనం ప్రకారం.. సాయంత్రం కొట్టంలో ఉన్న తన 12 మేక పిల్లలపై వీధి కుక్కలు ఒక్క సారి దాడి చేశాయన్నారు. ఈ దాడిలో12 మేక పిల్లలు మృతి చెందినట్లు చెప్పారు. గొర్రెల పెంపకం పై ఆధారపడి బతుకుతున్న తనకు ఇది తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వీధికుక్కల దాడులు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  

బాలికపై లైంగిక దాడి

చేగుంట, వెలుగు: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని ఓ గిరిజన తండాలో దారుణం జరిగింది. శుక్రవారం అర్థరాత్రి 16 ఏండ్ల బాలికపై ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధిత బాలిక తల్లిదండ్రులు పేలాలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. ఇటీవల సిద్దిపేట జిల్లా వర్గల్​మండలం అనంతగిరిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఇంటివద్ద ఒంటరిగా ఉన్న బాలికపై అదే తండాకు చెందిన ఓ యువకుడు, పక్క గ్రామానికి చెందిన మరో యువకుడు లైంగిక దాడి చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసుల నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.  

జీపీ ఆఫీస్ ముందు మహిళల నిరసన

మెదక్, వెలుగు: ప్రజాపాలనలో దరఖాస్తు చేసినప్పటికీ అధికారులు ఇందిరమ్మ ఇండ్ల సర్వే చేయడం లేదని మండల కేంద్రమైన నార్సింగి జీపీ ఆఫీసు ముందు గ్రామస్తులు శనివారం నిరసన చేపట్టారు. 14వ వార్డు పరిధిలోని వడ్డెర కాలనీలో ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రారంభించలేదన్నారు. తాము ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకున్నా ఎందుకు సర్వే చేయడం లేదని ప్రశ్నించారు. సర్వే చేయకుంటే తమకు ఇళ్లు మంజూరయ్యే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తమ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే నిర్వహించి ఇండ్లు మంజూరుచేయాలని కోరారు.

సోషల్​టాలెంట్​టెస్ట్​లో ప్రతిభ

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లా సోషల్ స్టడీస్ ఫోరం నిర్వహించిన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్ లో ఇర్కోడ్ మోడల్ స్కూల్ స్టూడెంట్​ భార్గవ్ మూడో ర్యాంక్ సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్ తెలిపారు. శనివారం సిద్దిపేటలోని టీటీసీ భవన్ లో ఇంగ్లీష్ మీడియం స్కూల్​లో 40 మంది స్టూడెంట్స్ పరీక్ష రాయగా 67 మార్కులు సాధించి భార్గవ్​రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతడిని టీచర్లు స్నేహలత, శ్రీదేవి అభినందించారు. 


మెదక్ టౌన్: మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హై స్కూల్​లో తెలంగాణ సోషల్ స్టడీస్ టీచర్ ఫోరం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్టును నిర్వహించారు. ప్రశ్నపత్రాల సీల్డ్ కవర్​ను ఎంఈవో నీలకంఠం ఆవిష్కరించారు. ఈ పరీక్షలో తెలుగు మీడియంలో సంజన ప్రథమ స్థానంలో, విశాల్​ ద్వితీయ స్థానంలో, సుజాత తృతీయ స్థానంలో, ఇంగ్లీష్ మీడియంలో ప్రథమ స్థానంలో మానస, ద్వితీయ స్థానం అక్షయ్, తృతీయ స్థానం కావేరి,  రెసిడెన్షియల్  విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో దశరథ్, కావేరి, సంజయ్​ విజేతలుగా నిలిచారు.ఈ సందర్భంగా వారికి డీఈవో రాధాకిషన్​ బహుమతులు ప్రదానం చేశారు.