నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 నల్గొండ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్


రైతులకు ఇబ్బంది కలిగించొద్దు
 
చండూరు (నాంపల్లి), వెలుగు : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. మంగళవారం నాంపల్లి మండలం సబ్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రం ఇన్​చార్జి నితీశ్ కుమార్ ను కొనుగోలు ఎలా జరుగుతున్నాయని అడిగారు.  

పరిధిని మించి ట్రీట్​మెంట్​చేస్తే చర్యలు  

సూర్యాపేట, వెలుగు: క్లినిక్స్ లో ఆర్ఎంపీలు​తమ పరిధిని మించి ట్రీట్​మెంట్​చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ వో డాక్టర్ కోట చలం హెచ్చరించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పలు క్లినిక్ లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్​వో మాట్లాడుతూ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లలో నిబంధనలను ఉల్లంఘించి ట్రీట్​మెంట్ చేయొద్దన్నారు. క్లినిక్స్​లో ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, ఇతర పరీక్షలు చేయొద్దని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సెంటర్లను మూసివేస్తామన్నారు.  

రైతులపై కేసులు ఎత్తివేయాలి

యాదాద్రి, వెలుగు : లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​ రెడ్డి డిమాండ్​ చేశారు. కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్​ విగ్రహాలకు వినతిపత్రాలు అందించారు. రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించిడం అమానుషమన్నారు. ఆనారోగ్యానికి గురైన రైతుకు బేడీలు వేస్తారా.? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే కేసులు ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు.  

చెక్ పోస్టులను తనిఖీ 

మేళ్లచెరువు(చింతలపాలెం), మఠంపల్లి : చింతలపాలెం, మఠంపల్లి మండలాల పరిధిలో ఉన్న అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులను మంగళవారం అడిషనల్ కలెక్టర్ రాంబాబు, జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్ రాజేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఏపీలోని ధాన్యం తెలంగాణకు తరలిస్తున్నారంటూ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో తనిఖీలు చేపట్టారు. మఠంపల్లి మండలం లోని చెక్ పోస్ట్, చింతలపాలెం మండలంలోని దొండపాడు, పులిచింతల ప్రాజెక్టు చెక్ పోస్ట్, చింత్రియాల, బుగ్గమాదారం గ్రామాల వద్ద రేవులోని బల్లకట్టును వారు పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి ధాన్యం తరలింపుపై వివరాలు సేకరించారు.  

దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలి

హుజూర్ నగర్, వెలుగు : ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం కల్పించాలని ఆ సంఘం గౌరవాధ్యక్షుడు ఆకుల రాము ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హుజూర్ నగర్ లో దివ్యాంగుల కమిటీ నాయకులతో సమావేశం నిర్వహించారు. రామస్వామిగుట్ట వద్ద పేదలకు పంచనున్న ఇండ్లలో దివ్యాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  

మల్టీపర్పస్ వర్కర్స్ నిరసన 

హుజూర్ నగర్, వెలుగు : చలో హైదరాబాద్ పాల్గొనకుండా మల్టీపర్పస్ వర్కర్స్ ను ముందస్తు అరెస్టు చేయడంతో మంగళవారం హుజూర్ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనకు సీఐటీయూ నాయకులు మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు మల్టీపర్పస్ వర్కర్స్ కు న్యాయం చేయాలని వారు కోరారు.

ఈనెల 19న వాహనాలు వేలం

హుజూర్ నగర్, వెలుగు : హుజూర్ నగర్ పరిధిలో సీజ్ చేసిన వివిధ రకాల వాహనాలను డిసెంబర్ 19న వేలం వేయనున్నట్లు ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఎక్సైజ్ అధికారి లక్ష్మ నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 10 గంటలకు వాహనాలకు వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు. ఈ వేలంలో పాల్గొనేవారు అదే రోజు ఉదయం 9 గంటలలోపు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్​లో రుసుం చెల్లించాలని సూచించారు. 

వేధింపులపై మహిళ ఫిర్యాదు

చండూరు (మర్రిగూడ), వెలుగు : ఎన్ఆర్ఈజీఎస్ లో ఉద్యోగి వేధిస్తున్నాడని ఉపాధి హామీ కూలీ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు, పోలీసుల వివరాల ప్రకారం.. ఎన్ఆర్ఈజీఎస్ లో పనిచేస్తున్న ఒక టెక్నికల్ అసిస్టెంట్ ఉపాధి హామీ జాబ్ కార్డు ఇప్పిస్తానని ఓ మహిళకు చెప్పాడు. పనిచేయకున్నా అటెండెన్స్ వేసి డబ్బులు ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఆ కూలీతో సన్నిహితంగా ఉంటూ లైంగికంగా వేధిస్తున్నాడు. సదరు మహిళ పలుమార్లు అతడికి వార్నింగ్ ఇచ్చినా బుద్ధి మారలేదు. అతడి వేధింపులు భరించలేక స్థానిక పోలీస్ స్టేషన్​లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు రంగంలోకి దిగి రాజీ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా వారి ప్లాన్ బెడిసికొట్టింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.