నిజామాబాద్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

నిజామాబాద్ జిల్లాలో  ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

పంచాయతీ స్థలాన్ని కజ్జాచేస్తే సహించం

భిక్కనూరు, వెలుగు: భిక్కనూరు మండల కేంద్రంలోని పితిరి వాగు సమీపంలో అప్పటి గ్రామ సర్పంచ్ బండి రాములు శ్మశానవాటికల కోసం ఎకరం పంచాయతీ స్థలాన్ని కేటాయించారని గ్రామస్తులు తెలిపారు. కాగా ఆ భూమిని భిక్కనూరుకు చెందిన కొందరు రియల్​ఎస్టేట్​ వ్యాపారులు  కజ్జా చేసి వెంచర్​ వేయడంతో మంగళవారం అడ్డుకున్నారు. పంచాయతీ కేటాయించిన శ్మశానవాటిలో  అంత్యక్రియలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. 

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి టౌన్, వెలుగు:   సివిల్ సప్లయ్​ గోదాముల్లో పనిచేసే హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో  మంగళవారం కామారెడ్డి  డీఎం రాజేందర్​కు వినతి పత్రం అందజేశారు.  మూడేండ్ల క్రితం ఒప్పందమైన రేట్లను అమలు చేయాలని, పీఎఫ్ ,  రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.  సమస్యల పరిష్కారం కోసం బుధవారం చలో సివిల్​ సప్లయ్​ ఆఫీసు పోగ్రాం చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో  ఏఐటీయూసీ జిల్లా ప్రెసిడెంట్​ పి.బాలరాజు,  ప్రతినిధులు భీమయ్య, ఎల్.దశరథ్​ తదితరులు పాల్గొన్నారు. 

గంజాయి కేసులో ఆరుగురికి రిమాండ్

లింగంపేట, వెలుగు: గంజాయిసాగు చేస్తూ విక్రయించిన వ్యక్తితో పాటు కొనుగోలు చేసిన ఐదుగురు యువకులకు మంగళవారం కోర్టు రిమాండ్​ విధించినట్లు  ఎస్ఐ సుధాకర్​ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట మండలంలోని రాంపల్లి కొనతండాకు చెందిన దేవసోత్ శంకర్​ తన ఇంటివద్ద గంజాయి  సాగుచేస్తూ విక్రయిస్తున్నాడు.  గంజాయిని మండలంలోని బాయంపల్లి గ్రామానికి చెందిన అంబెపు సతీష్, కొర్పొల్ గ్రామానికి చెందిన పొట్టోళ్ల ఆస్టిన్ కు విక్రయిస్తున్నాడు. 

వారు తమ స్నేహితులైన కామారెడ్డికి చెందిన పిడుతల శ్రీనివాస్, బట్టుసాయి కృష్ణ, అడ్లూర్​ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇంద్రసేనారెడ్డికి విక్రయించేవారు.  వీరు గంజాయిని కొనుగోలు చేసేందుకు  రాంపల్లి కొనతండాకు వచ్చినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో సోమవారం సాయంత్రం వారిని పట్టుకున్నారు.  నిందితుల నుంచి రెండు బైక్​లు, ఆరు సెల్​ఫోన్లు, ఎండు గంజాయి, గంజాయి మొక్కను స్వాధీనం చేసుకున్నారు. 

రోడ్డుపై పడి వ్యక్తి మృతి

కామారెడ్డి, వెలుగు:  మాచారెడ్డి మండల కేంద్రంలో  మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపైపడి చనిపోయాడు.  మద్యం మత్తులో రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలై చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు 
చేస్తున్నారు. 

మూడు ఇళ్లలో చోరీలు

లింగంపేట, వెలుగు:  లింగంపేట మండల కేంద్రంలోని రెండు ఇండ్లలో, పర్మల్ల గ్రామంలో ఓ ఇంట్లో మంగళవారం తెల్లవారు జామున  గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు.  మండల కేంద్రంలోని కొత్వాల్​గల్లీకి చెందిన రియాజ్ ఇంటిలో బీరువాలో దాచిన వెండి వస్తువులు, నగదు, పట్టుచీరలు, జావిద్​ఇంటిలో బీరువాలో దాచిన బంగారు గొలుసు, కమ్మలు, రూ.14 వేల నగదు  దోచుకెళ్లారు.  

ముగ్గురు వ్యక్తులు బైక్​పై వచ్చి దొంగతనం చేసినట్లు స్థానికులు తెలిపారు. పర్మల్ల గ్రామానికి చెందిన గంట బాలమణి ఇంట్లో అర తులం బంగారం, వెండి ఉంగరాలు, పట్టీలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.  మండల కేంద్రంలో చోరీ జరిగిన ఇండ్లను ఎస్ఐ సుధాకర్​పరిశీలించారు. దొంగతనం జరిగిన మాట వాస్తవమేనని బాధితులు ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ తెలిపారు.

నిబంధనలు పాటించాలి

ఆర్మూర్, వెలుగు: వాహనదారులు ట్రాఫిక్​నిబంధనలు పాటించాలని ఆర్మూర్​ఎంవీఐ వివేకానందరెడ్డి అన్నారు.  మంగళవారం ఆర్టీవో ఆఫీస్ ముందు రోడ్డు ప్రమాదాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం​ నడపొద్దని, సెల్ ఫోన్​ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని, హెల్మెట్​ధరించాలని సూచించారు.   

దుప్పట్లు అందజేత

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ లోని రక్ష స్వచ్చంద సేవా సంస్థ ప్రతినిధులు నిరాశ్రయులకు దుప్పట్లు అందజేశారు. సోమవారం అర్ధరాత్రి ఆర్మూర్​ మున్సిపల్​పరిధిలోని ఆర్మూర్, పెర్కిట్, మామిడిపల్లిలో చలికి వణుతున్న యాచకులు, వృద్ధులకు దుప్పట్లు కప్పారు. కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షుడు ఖాందేష్ శ్రీనివాస్,  ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షుడు జిందం నరహరి, కోశాధికారి గోనె శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు బేతు గంగాధర్, ఖాందేశ్ సత్యం, తులసి పట్వారి, సంయుక్త కార్యదర్శులు గోక శరత్, మక్కల సాయినాథ్, సభ్యులు పాల్గొన్నారు .