వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

ఘనంగా గణిత దినోత్సవం

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ గిరిజన బాలికల ఆశ్రమ హైస్కూల్​లో గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్టూడెంట్లు రంగులతో గణిత ఎగ్జి​బిట్లను  ప్రదర్శించారు. ప్రతిభ కనబర్చిన స్టూడెంట్లకు హెచ్ఎం రవీందర్​రెడ్డి బహుమతులు అందించారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ జడ్పీ బాలుర హై స్కూల్​లో నిర్వహించిన గణిత దినోత్సవానికి డీఈవో వాసంతి హాజరై ఎగ్జిబిట్లను పరిశీలించి, విద్యార్థులను అభినందించారు. 

పీఎస్​ను తనిఖీ చేసిన డీఎస్పీ 

తాడ్వాయి, వెలుగు: వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ను శనివారం డీఎస్పీ నులువాల రవీందర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేసుల వివరాలను ఎస్సై శ్రీకాంత్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. అనంతరం సిబ్బందితో రోల్ కాల్ నిర్వహించారు.

నేడు కాకతీయ కదనభేరి

కాజీపేట, వెలుగు: వరంగల్ ఇస్లామియా కాలేజీ గ్రౌండ్స్ లో ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయులతో కాకతీయ కదనభేరి బహిరంగసభను నిర్వహిస్తున్నట్లు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కందుల జీవన్ కుమార్ తెలిపారు. శనివారం కాజీపేట మీడియా పాయింట్ లో కాకతీ కదనభేరి బహిరంగ సభ పోస్టర్ ను విడుదల చేశారు.

వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నర్సింహులపేట(దంతాలపల్లి), వెలుగు: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి తహసీల్దార్ ఆఫీస్​ఎదుట శనివారం కుమ్మరికుంట్లకు చెందిన ఐనాల ఓంశంకర్​పెట్రోల్ బాటిల్ తో ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆయన తండ్రి ఉప్పలయ్య అదే గ్రామానికి చెందిన వెంకటయ్య వద్ద రెండెకరాల పొలం కొన్నాడు. కానీ రిజిస్ర్టేషన్​ చేయించుకోకపోవడంతో అప్పట్లో పని చేసిన తహసీల్దార్, వీఆర్వోలు అక్రమంగా వెంకటయ్య కోడలు సరిత పేరున పట్టా చేశారని, ఇప్పుడు ఆమె ఆ పొలాన్ని విక్రయిస్తోందని బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని తహసీల్దార్​ఆఫీస్​ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి పెట్రోల్​పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో పోలీసులు వచ్చి నచ్చజెప్పారు.  

యాక్సిడెంట్ లో ఇద్దరికి గాయాలు

వర్ధన్నపేట, వెలుగు: లారీ, బొలెరో ఢీకొని ఇద్దరికి గాయాలైన ఘటన వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం నుంచి వరంగల్​కు చేప పిల్లలతో వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఇల్లంద గ్రామం వద్ద వరంగల్​వైపు నుంచి వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో బొలెరో డ్రైవర్​శ్రీను, లారీ డ్రైవర్​కు గాయాలయ్యాయి. స్థానికులు 108 లో ఆస్పత్రికి తరలించారు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ల్యాబ్ ​ప్రారంభం

కాజీపేట, వెలుగు: కాజీపేట సోమిడిలోని తాళ్ల పద్మావతి కాలేజీలో శనివారం టాస్క్ సీఈవో శ్రీకాంత్ సిన్హా సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ ల్యాబ్ ను ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం, ఇడునెట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.25 లక్షలతో ల్యాబ్ ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా ఇంజినీరింగ్ స్టూడెంట్లకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

పోక్సో కేసులో ఇద్దరి అరెస్ట్​

భీమదేవరపల్లి, వెలుగు: పోక్సో కేసులో ఇద్దరి అరెస్ట్​ అయిన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్  పోలీస్​స్టేషన్​ పరిధిలో శనివారం చోటు చేసుకున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. బోల్లోన్​పల్లికి చెందిన పత్తిపాక రాజ్​కుమార్, గట్లనర్సింగాపూర్​కి చెందిన రేసు అనిల్ బాలికను వేధించిన కేసులో ఇద్దరిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకం

తొర్రూరు, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు కీలకమని వికాస్ హై స్కూల్ కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేశ్​ గౌడ్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ వికాస్ హై స్కూల్లో ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఓటు వేసే విధానంపై మాక్ ఓటింగ్ నిర్వహించారు.