వరంగల్ జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

 వరంగల్  జిల్లాలో ఫటాఫట్ వార్తలు ఇవే.. డోంట్ మిస్

పోటీ పరీక్షల ట్రైనింగ్ కు అప్లికేషన్ల స్వీకరణ

జనగామ అర్బన్, వెలుగు: పోటీ పరీక్షలకు హాజరయ్యే యువత ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఎండబ్ల్యూవో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  హైదరాబాద్‌లోని  తెలంగాణ రాష్ట్ర  మైనార్టీస్ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగ యువతకు  గ్రూప్​1,2,3,4 లతో పాటు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్, స్టాఫ్​సెలక్షన్​ కమిషన్​, బ్యాంకింగ్​రంగాల్లో  నాలుగు  నెలల బేసిక్​ ఫౌండేషన్​ కోర్స్‌ ను  మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా శిక్షణ ఇస్తుందన్నారు.  దరఖాస్తులను కలెక్టరేట్‌లోని  డీఎండబ్ల్యూవో ఆఫీస్​లో 2025,  జనవరి 16 లోపు సమర్పించాలని పేర్కొన్నారు.

ప్రొవిజినల్ జాబితాపై అభ్యంతరాలు తెలపాలి

జనగామ అర్బన్, వెలుగు: ఎంఎల్​హెచ్​పీ అభ్యర్థుల ప్రొవిజినల్​ జాబితాపై అభ్యంతరాలుంటే తెలపాలని డీఎంహెచ్​వో డాక్టర్​ మల్లికార్జున రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.  జిల్లా కలెక్టర్​ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ జనగామలో 9  పోస్టుల భర్తీ కోసం అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి 2024, డిసెంబర్​19వ తేదీ వరకు స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి ప్రొవిజినల్​ లిస్ట్​ లను జిల్లా అధికారిక వెబ్​సైట్​ https;//jangaon.telangana.gov.in// లో వైద్య ఆరోగ్య శాఖ ఆఫీస్​ నోటీస్​ బోర్డ్​లో ఉంచినట్లు తెలిపారు.  అభ్యంతరాలను  డీఎంహెచ్​వో ఆఫీసులో  ఈ నెల 7న సాయంత్రం 5 గంటల లోపు స్వయంగా సమర్పించాలని పేర్కొన్నారు.

మాంజా, గుట్కా అమ్ముతున్న వ్యక్తులపై కేసు

కాజీపేట, వెలుగు:  కాజీపేట పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నిషేధిత మాంజా దారాలు, గుట్కాలు అమ్ముతున్న వారిపై పోలీసులు  కేసులు నమోదు చేశారు.  కాజీపేట ఎస్సైలు శివకృష్ణ, నవీన్ కుమార్ వివిధ కిరాణ షాపులు, పాన్ షాపుల్లో శుక్రవారం తనిఖీలు చేసి నిషేధిత గుట్కాలు,మాంజా  దారాలు అమ్ముతున్నవారిపై కేసులు పెట్టారు. కాజీపేట విష్ణుపురి ప్రాంతంలో మాంజా  దారాలు అమ్ముతున్న శనగరపు అరవింద్, ఎండి ఇషాక్, మంద శ్రీనాథ్, ఎండి సల్మాన్లపై  కేసులు పెట్టి రూ. 2 లక్షల విలువైన మాంజా  దారాలను పట్టుకున్నారు.  గుట్కాలు అమ్ముతున్న  దర్గా కాజీపేట, ప్రశాంత్ నగర్ కు చెందిన  ఎండి అక్బర్, నద్దునూరి 
ఎల్లస్వామిలపై కేసు పెట్టారు.

తాటిచెట్టు  పై నుంచి పడటంతో గీతకార్మికుడికి గాయాలు

పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామానికి  చెందిన గడ్డం వెంకట్ నారాయణ గౌడ్ శుక్రవారం తాటిచెట్టు ఎక్కి దిగుతున్న క్రమంలో జారి కింద పడటంతో నడుము విరిగి తీవ్ర గాయాలయ్యాయి.   వరంగల్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పట్టాపురం ఏకాంతం గౌడ్,  జిల్లా ఉపాధ్యక్షుడు బాల్య వెంకట రాజు గౌడ్‌తో కలిసి ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. పరశురాములు,  రవి, చంద్రమౌళి, అంజయ్య,  రఘుమోహన్ పరామర్శించారు. --------------------------- 

చేర్యాల మార్కెట్ చైర్మన్ శ్వేత ఆత్మహత్యాయత్నం?

  • పుకార్లు నమ్మొద్దు:  భర్త వెంకటేశ్వర్లు 

బచ్చన్నపేట, వెలుగు:  సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్​ కమిటీ  చైర్మన్​ నల్లనాగుల శ్వేత ఆత్మహత్యాయత్నం చేసుకుందని శుక్రవారం పట్టణంలో ప్రచారం జరిగింది.  శ్వేత అయిదు నెలల కింద సిద్దిపేట జిల్లా చేర్యాల మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎన్నికైంది.  కుటుంబ తగాదాల వల్లే ఆమె గడ్డిమందు తాగిందని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.  అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారని తెలుస్తోంది.  దీనిపై స్పందించిన శ్వేత భర్త వెంకటేశ్వర్లు ఆమెకు ఫుడ్ పాయిజన్ కావడం వల్లే జనగామలో చికిత్స చేయించి హైదరాబాద్‌లోని తమ ఇంటికి తీసుకెళ్లామని చెప్పారు. తమకు గిట్టని వారు అసత్య ప్రచారం చేస్తున్నారని  పుకార్లు నమ్మొద్దన్నారు. 

గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో

వెంకటాపురం,వెలుగు : యకన్న గూడెం గ్రామం వద్ద  కుంగిన బ్రిడ్జి రహదారి నిర్మాణాలు తక్షణమే పూర్తి చేయాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం వెంకటాపురం ప్రధాన రహదారి రాస్తారోకో చేశారు.  మండల కేంద్రం పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఎన్ఎస్ రాష్ట్ర నాయకులు పుణెం సాయి, కోర్సు నరసింహమూర్తి  బైఠాయించారు. చర్ల మండలం నుంచి  వస్తున్న లారీలు అధిక లోడు ఇసుక తరలింపు చేయటం వల్లే  బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయని అన్నారు. ఆర్అండ్ బి ఎస్. సి వెంకటేశ్వర్లు  ఇసుక రీచ్ నుండి ఓవర్ లోడ్ తో వెళ్లే లారీలను విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రెండు నెలల్లో రహదారి నిర్మాణం, బ్రిడ్జి మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు.