మార్గదర్శి అభ్యుదయ క్యాలెండర్ ఆవిష్కరణ
భీమదేవరపల్లి, వెలుగు : మార్గదర్శి మహిళా అభ్యుదయ సమాఖ్య ఏర్పడి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో నవజీవనం సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ రాపోలు జీవన్‌రెడ్డి సిల్వర్ జూబ్లీ క్యాలెండర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా ఆర్థిక స్వాలంబన సాధించేందుకు సంస్థ తోడుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్గదర్శి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉప్పల కుమారస్వామి, మేనేజర్ గాండ్ల పద్మ, డైరెక్టర్స్ పొన్నాల సరస్వతి, స్రవంతి, వలబోజు పుష్ప, అనూష, లావణ్య, అమరావతి, యశోద, శ్రీలత, సరోజన తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి ఆత్మహత్య
తొర్రూరు (పెద్దవంగర), వెలుగు : భర్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి గురై ఓ వృద్ధురాలు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై క్రాంతి కిరణ్, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవంగరకు చెందిన అనపురం సోమయ్య ఐదు నెలల కింద అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఆయన భార్య సోమ లక్ష్మి (58) మనస్తాపానికి గురై, అనారోగ్యంతో బాధపడుతుంది. ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం ఇంట్లో నుంచి బయటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూసేసరికి అప్పటికే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కొడుకులు, కుమార్తె ఉన్నారు. కొడుకు కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
నల్లబెల్లి, వెలుగు : చికిత్స పొందుతూ మహిళ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రుద్రగూడెంలో ఆదివారం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిండి మానస శ్రీను దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. దీంతో శనివారం మానస పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి మూడేండ్ల కూతురుకు తాగించి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ పొందుతూ మానస మృతి చెందగా, చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
యాక్సిడెంట్లో వ్యక్తికి గాయాలు
భీమదేవరపల్లి, వెలుగు : కారు, బైక్ ఢీకొనడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రాంనగర్, గట్ల నర్సింగాపూర్ గ్రామాల మధ్యలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా చిలుపూరు మండలం వెంకటాద్రిపేటకు చెందిన కందుల మధు తన బైక్‌పై హుస్నాబాద్‌కు వెళ్తుండగా రాంనగర్, గట్ల నర్సింగాపూర్గ్రామాల మధ్య కారు వేగంగా ఢీకొట్టడంతో తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు 108 సమాచారం ఇచ్చి, వరంగల్ఎంజీఎంకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై సాయిబాబా తెలిపారు.